సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలలో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం సోమవారం ముగిసింది. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఈ నెల 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల విభాగం అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లు వేశారు. ఐతే 15 మందికి గానూ 17 మంది నామినేషన్లు వేయడం, ఇందులో ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. 17 మంది నామినేషన్ల పత్రాలను మంగళవారం అధికారులు పరిశీలించనున్నారు.
ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణ, ఆదే రోజు బరిలో ఉండే అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు. 17 మంది బరిలో ఉంటే మాత్రం ఈ నెల 25వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, కౌంటింగ్ మూడు గంటల తర్వాత ఉండనుందని అధికారులు పేర్కొన్నారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ వేయగా చివరి నిమిషంలో ఉపసంహరించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియకు బీజేపీ దూరంగా ఉండడం గమనార్హం. ఎన్నికల ఏడాది కావడం, స్టాండింగ్ కమిటీలో ఉంటే ప్రభుత్వంలో భాగమేనన్న సంకేతాల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా దూరంగా ఉందని ఆ పార్టీ కార్పొరేటర్లు చెబుతున్నారు.