Chit Funds | సిటీబ్యూరో: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా ఓ చిట్‌ఫండ్ కంపెనీ మోసానికి పాల్పడిందంటూ రిటైర్డు ఉద్యోగి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. బోడుప్పల్‌కు చెందిన సత్యనారాయణ రిటైర్డ్ ఉద్యోగి. లక్డీకాపూల్‌లోని శ్రీనిలయ చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తన స్నేహితుల ద్వారా 40 నెలల కాల పరిమితితో రూ. 20 లక్షల చిట్టీ వేశారు.
ఈ ఏడాది జనవరిలో చిట్టీ పాడగా, రూ. 17.2 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ బసవ శంకర్రావు అడప, డైరెక్టర్లు రమేశ్ అడప బాబు, రమాదేవి అడప, గీతా రమేశ్ అడప నిర్ణీత సమయంలో ఇవ్వలేదు. దీంతో సంస్థ ఎండీని బాధితుడు నిలదీయగా, తమకు కూడా రూ. 12 కోట్ల వరకు కస్టమర్ల ద్వారా వచ్చేవి ఉన్నాయని, అవి వచ్చిన తరువాత ఇస్తామంటూ చెప్పారు.
ఇలా 40 మంది వరకు చిట్టీ డబ్బులు శ్రీనిలయ యాజమాన్యం ఇవ్వాల్సి ఉన్నదని, తమ వద్ద తీసుకున్న చిట్టీ డబ్బులు మళ్లించి ఇతర ఆస్తులు కొనుగోలు చేశారని బాధితుడు ఆరోపించారు. ఇప్పటికే మూడు శాఖలను మూసేసిన సంస్థ యాజమాన్యం ప్రధాన కార్యాలయాన్ని కూడా మూసేస్తుందంటూ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.