బేగంపేట్ అక్టోబర్ 3: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆలయంలో ధర్మకర్తల మండలి సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవాల వివరాలు వెల్లడించారు. భక్తులకు కావలసిన ఏ ర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి రోజు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నట్లు తెలిపారు. అమ్మవారిని ఉదయం ఆరు గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 10 వరకు భక్తులు దర్శించుకోవచ్చునని తెలిపారు. 14వ తేదీన ఆలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఆలయంలో చండీ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్తలు ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.