కవాడిగూడ, జనవరి 23: అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం శ్రీ రాముని పట్టాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వర పీఠం ఆధ్వర్యంలో శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ అవతరణ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కోటి ప్రత్యంగిరా మహాయాగంలో భాగంగా మూడోరోజు శ్రీరాముని పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వాణీదేవి, విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమోధ్య రామ మందిరంలో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శ్రీరాముని పట్టాభిషకం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉన్నదని సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న భక్తులంతా శ్రీరామ జపం చేయడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు శ్రీరామ నామస్మరణతో మార్మొగాయి. కోటి ప్రత్యంగిరా మహాయాగం వల్ల లోక కల్యాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహం చేశారు. కార్యక్రమంలో రమ్యానంద భారతి స్వామి, పీఠం కో-ఆర్డినేటర్ మునిపల్లి శ్రీనివాస్, ఛీప్ అపరేటింగ్ ఆఫీసర్ మోచర్ల శశిభూషణ్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, భక్తులకు తీర్థప్రసాద వితరణ, అన్ననదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.