Sports Kits | సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ): చిన్నారులతో పాటు యువతలో క్రీడా నైపుణ్యతను పెంపొందించడంపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యపు ధోరణిని అవలంభిస్తోంది. వేసవి కంటే ముందే ప్రతి డివిజన్‌కు రూ. 2 లక్షల క్రీడా సామగ్రికి సంబంధిత కార్పొరేటర్లకు అందజేయాలని ఐదు నెలల క్రితం జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
మేయర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో రూ. మూడు కోట్లతో క్రికెట్, షటిల్, బ్యాట్మింటన్, క్యారమ్, చెస్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, స్కేటింగ్, టెన్నీస్, టెబుల్ టెన్నీస్ తదితర క్రీడా సామగ్రిని సంబంధిత కార్పొరేటర్లను అందజేయాలని నిర్ణయించారు. 150 డివిజన్లకు గానూ రూ. రెండు లక్షల చొప్పున క్రీడా సామగ్రి పంపిణీకి ఏజెన్సీని ఖరారు చేసిన స్పోర్ట్స్ విభాగం అధికారులు తదనంతరం క్రీడా కిట్ల పంపిణీలో మాత్రం జాప్యం చేశారు. తాజాగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల కోడ్ రావడంతో ఈ పంపిణీ ప్రక్రియ నిలిపివేశారు. ఈ నెల 26 తర్వాతనే ఆయా కార్పొరేటర్లకు క్రీడా సామగ్రిని అందజేస్తామని స్పోర్ట్స్ విభాగం అధికారులు తెలిపారు.