హైదరాబాద్ కేంద్రంగా రాకెట్ వేగంతో దూసుకుపోయే స్పోర్ట్స్ కార్లను బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకల్లో భాగంగా ప్రదర్శించారు. వందేండ్ల పండుగలో భాగంగా నేటితరం యువతను ఎంతగానో ఆకట్టుకునే లగ్జరీ కార్లు మంగళవారం సందడి చేశాయి.
సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): ఇక్కడ కనిపించేవన్నీ సూపర్ కార్లు.. అత్యంత విలాసవంతమైన కార్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాయి. ఒకసారి కారు ఇంజిన్ స్టార్ట్ అయ్యిందంటే రయ్యుమంటూ దూసుకుపోతాయి. క్షణాల్లో పదుల కిలోమీటర్ల పికప్‌ను అందుకునే ఈ కార్ల ఖరీదు కూడా అందనీ ద్రాక్షలాగా కోట్లలోనే ఉంటాయి. హైదరాబాద్ కేంద్రంగా రాకెట్ వేగంతో దూసుకుపోయే స్పోర్ట్స్ కార్లను బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకల్లో భాగంగా ప్రదర్శించారు.
ఈ నెల 24న ప్రారంభమైన వేడుకల్లో భాగంగా రోజువారీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వందేళ్ల హెచ్‌పీఎస్ చారిత్రక, వారసత్వ ఔనత్యాన్ని చాటుతున్నారు. వందేళ్ల పండుగలో భాగంగా వింటేజ్ కార్లను ప్రదర్శించగా… మంగళవారం స్పోర్ట్స్ కార్లతో సూపర్ కారు షోను ఏర్పాటు చేశారు. నేటితరం యువతను ఎంతగానో ఆకట్టుకునే లగ్జరీ కార్లు హెచ్‌పీఎస్‌లో సందడి చేశాయి. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకల్లో 12కిపైగా ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు చెందిన కార్లను ప్రదర్శించారు. వీటిలో లంబోర్గిని, పోర్ష్తోపాటు, బీఎండబ్ల్యూ, ఆడీతోపాటు, ఫెరారీ వంటి కార్లు ఉన్నాయి. అంతకుముందు నిర్వహించిన స్టార్ట్ ఎక్స్ సమ్మిట్‌లో పూర్వవిద్యార్థులైన సినీ ప్రముఖులు రానా దగ్గుబాటి, డైరెక్టర్ నాగ్ అశ్విన్, మెటా మాజీ ప్రొడక్ట్ మేనేజర్ సతీశ్‌తో పాటు పలువురు ఆంత్రప్రెన్యూర్లు పాల్గొన్నారు.
కార్నివాల్ సంబురాల్లో భాగంగా హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12గంటల నుంచి కార్నివాల్ సందడి మొదలు కాగా తొలుత హెచ్‌పీఎస్ మ్యూజికల్ బ్యాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఎంతగానో అలరించింది. సాయంత్రం 6 గంటల నుంచి రీయూనియన్ మ్యూజికల్ కన్సర్ట్ పేరిట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో కలిసి మ్యూజిక్ షోతో ఆకట్టుకున్నారు. రెండో రోజున నిర్వహించిన యూత్ పార్లమెంట్ సమావేశాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండో రోజున కొందరు విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. యూత్ పార్లమెంట్ వేడుకల్లో ప్రతిభ కనబర్చిన ఉత్తమ విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
భారతీయ సంగీతత్రయంగా శంకర్ మహాదేవన్, ఎహ్సాన్ నూరానీ, లాయ్ మెండోన్సాలతో కూడిన బృందం జరిగే లైవ్ మ్యూజికల్ షోతో శతాబ్ది వేడుకలు ముగియనున్నాయి. హెచ్‌పీఎస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఈ ముగ్గురు సంగీత కళాకారుల ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో ఉన్న వీరి పాటలకు విశేష ఆదరణ ఉండగా, హెచ్‌పీఎస్ వేడుకగా నిర్వహించే కార్యక్రమంలో ఈ మ్యూజికల్ ట్రయోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.