సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పాతబస్తీ మెట్రో కారిడార్, ప్యారడైస్-శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత పనుల పురోగతిపై మెట్రో, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు భూసేకరణ పూర్తిచేస్తే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయవచ్చని అన్నారు. అదేవిధంగా ప్యారడైస్-శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణకు సంబంధించి తలెత్తిన అభ్యంతరాలకు సంబంధించి అధికారులకు కలెక్టర్ పలు పరిష్కారాలు సూచించారు. అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, మెట్రో అధికారులు, సికింద్రాబాద్ ఆర్డీవో సాయి రామ్, ఖైరతాబాద్ తహసీల్దార్ నయీముద్దీన్ పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
విధుల్లో నిర్లక్ష్యం వహించే ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిచందన అన్నారు. గురువారం గోల్కొండ ఏరియా ఆస్పత్రి, కుమ్మరివాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు.
గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మలేరియా,డెంగీ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, అదనపు డీఎంహెచ్వో డాక్టర్ మురళీధర్, డాక్టర్ అయేషా సుల్తానా, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.