కవాడిగూడ, మే 28: ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లంచం తీసుకుంటూ.. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని సీతాఫల్మండిలో నివాసముంటున్న జి.రామకృష్ణ క్యాంటిన్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కుటుంబసభ్యుల్లో ఒకరు చనిపోవడంతో ఆమె పేరుమీద తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు బ్యాంక్ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని సూచించారు.
ఈ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న జి.రామకృష్ణ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ఆర్ఐ భూపాల మహేశ్‌ను కలిశారు. సర్టిఫికెట్ కావాలంటే మీరు కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుందని, అది ఆలస్యమవుతుందని, సర్టిఫికెట్ త్వరగా కావాలంటే లక్షా 25 వేలు లంచం ఇవ్వాలని స్పెషల్ ఆర్ఐ రామకృష్ణను అడిగాడు. తాను అంత చెల్లించుకోలేనని చెప్పినా.. వినిపించుకోకుండా లక్షా పదివేలు ఇవ్వాల్సిందేనని అప్పుడే సర్టిఫికెట్ జారీ చేస్తానన్నాడు. దీంతో రామకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
సిటీ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. బుధవారం ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న మహేశ్‌కు లంచం ఇవ్వడానికి బాధితుడు రామకృష్ణకు 25 వేల రూపాయల నగదు ఇచ్చి లోపలికి పంపించారు. రామకృష్ణ నుంచి స్పెషల్ ఆర్ఐ మహేశ్ 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. భూపాల మహేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.