సిటీబ్యూరో, ఆగస్టు 31(నమస్తే): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) శంకరయ్య అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో దివ్యాంగులు, థర్డ్ జండర్, వయోజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పలు ఎన్జీవోలు, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ భవిష్యత్ ఓటర్ల కోసం సెకండరీ స్కూళ్లలో ఎన్నికల అక్షరాస్యత క్లబ్బుల ఏర్పాటు, కొత్త ఓటర్ల నమోదు కోసం డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు, వర్సిటీల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఓటర్లను చైతన్యపరిచే దిశగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్జీవోలు సహకరించాలని, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వినియోగించి ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలన్నారు. అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెంచేందుకు భాగస్వామ్యం చాలా ముఖ్యమని, అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అన్నారు. డిజిటల్ ఓటరు నమోదుపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్వీప్ నోడల్ అధికారి డా.అబ్దుల్ వకీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ సౌజన్య, పీవో విజయలక్ష్మి, స్వీప్ అసిస్టెంట్ నోడల్ అధికారి వెటర్నరీ డా.నిజాం హుస్సేన్, స్వీప్ అసిస్టెంట్ నోడల్ అధికారులు, యూసీడీ ప్రాజెక్టు అధికారులు, వెటర్నరీ విభాగం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.