సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను సమర్థవంతంగా నియంత్రించే క్రమంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ మార్షల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎస్సీఎస్సీ సహకారంతో మొదటి దఫాగా 83 మందికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక డ్రెస్ కోడ్ కలిగిన ట్రాఫిక్ మార్షల్స్ ఐటీ కారిడార్‌లోని బాటిల్‌నెక్, అత్యంత రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద విధులు నిర్వర్తిస్తారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు వీరు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పని చేయనున్నారు. ట్రాఫిక్ మార్షల్స్ సహకారంతో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నియంత్రణ మరింత సులభతరం కానుండటంతోపాటు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనులపై, ఇతర అంశాలపై దృష్టి పెట్టే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ట్రాఫిక్ నియంత్రణకు రూపొందించిన మార్షల్స్ విధానాన్ని శుక్రవారం కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌తో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మహంతి మాట్లాడుతూ..
సైబరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు కారిడార్‌లోని అన్ని కంపెనీలు పోలీసులకు సహకరించాలన్నారు. ఇప్పటికే సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) పలు విధాలుగా, అందులోని సభ్యత్వం ఉన్న కంపెనీలను అభినందించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్రాఫిక్ మార్షల్స్ బాధ్యతాయుతంగా పనిచేసి, పోలీసు శాఖకు వన్నెతెచ్చే విధంగా విధులు నిర్వర్తించాలని సీపీ మార్షల్స్‌కు సూచించారు. జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ మార్షల్స్‌కు ఆయా కంపెనీల సహకారంతో తగిన గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ మార్షల్స్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రహేజా మైండ్ స్పేస్ డైరెక్టర్ శ్రావణ్‌కుమార్, ట్రాఫిక్ అదనపు డీసీపీలు శివకుమార్ వీరన్న, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ పి.నాగభూషణం, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ మార్షల్స్ తదితరులు
పాల్గొన్నారు.