సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కొత్త సంవత్సరం జోష్ మొదలైంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు మహానగరం సిద్ధమవుతోంది. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి నిర్వహించే కార్యక్రమాల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిర్వాహకులు అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ పోలీసులు ఈ వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించారు.
డ్రగ్స్ సరఫరాపై స్పెషల్ ఫోకస్..
న్యూ ఇయర్ వేడుకలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆట, పాటలతో పాటు మత్తు పదార్థాలు. దీనిని దృష్టిలో పెట్టుకున్న మూడు కమిషనరేట్ల పోలీసులు.. గత రెండు నెలలుగా డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. ముఠాలను పట్టుకుంటూ కటకటాల్లోకి పంపుతున్నారు. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారంతో మూడు కమిషనరేట్ల పోలీసులు అన్ని మార్గాలపై నిఘా పెంచారు.
పబ్బులు, ఫామ్‌హౌస్‌లపై ప్రత్యేక నిఘా..
న్యూ ఇయర్ వేడుకలకు పబ్బులు, ఫామ్‌హౌస్‌లు వేదికగా మారనుండటంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే వారి నుంచి దరఖాస్తులు కోరిన పోలీసు శాఖ, వేడుకలు జరిగే ప్రాంతాలు, అక్కడ జరిగే కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బేగంపేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న పబ్బులు, క్లబ్బులతో పాటు మొయినాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శంషాబాద్, చేవెళ్ల, నార్సింగి, మేడ్చల్, శామీర్‌పేట, భువనగిరి, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌పై పోలీసులు నిఘా పెంచారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా…
న్యూయర్ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై నిఘా పెట్టేందుకు ప్రతి ఏసీపీ డివిజన్ పరిధిలో నాలుగు చొప్పున ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో తనిఖీలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా గ్రేటర్‌లోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వేడుకలు జరిగే ప్రాంతాలతో పాటు నగరంలోని హాట్ స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
వారి కదలికలను గమనిస్తున్నాం
డ్రగ్స్ ముఠాల కదలికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. గతంలో పట్టుబడి జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై కూడా నిఘా పెట్టాం. ప్రధానంగా డ్రగ్స్ సరఫరా జరిగే ప్రాంతాలు, సరఫరా చేసే ముఠాలపై నిఘా ఉన్నది. న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహించే పబ్బులు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్ వంటి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. అక్కడ జరిగే అన్ని రకాల కార్యక్రమాలను గమనించేందుకు ప్రత్యేక టీమ్స్ పనిచేస్తున్నాయి. వేడుకలను వేడుకగా జరుపుకోవాలి. డ్రగ్స్ సరఫరా చేసినా, వినియోగించినా చట్టరీత్యా నేరం. ఈ కేసుల్లో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించం. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలి. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటాం.
– స్టీఫెన్ రవీంద్ర,, సైబరాబాద్ పోలీసు కమిషనర్