సిటీబ్యూరో, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జోన్ల వారీగా కేసుల దర్యాప్తుకు సంబంధించిన స్థితిగతులు, జరుగుతున్న నేరాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, వాటికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసుల దర్యాప్తునకు సంబంధించిన పురోగతి తదితర అంశాలపై సీపీ సమీక్షించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన కారణాలపై సీపీ ఆరా తీశారు.
174 కేసులపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా మహిళలు, బాలికలు, పిల్లలపై జరిగే వేధింపులు, కిడ్నాప్‌లు, అదృశ్యం తదితర కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. సైబర్‌క్రైమ్స్, రౌడీయిజం, గూండాయిజం, ఆస్తి తగాదాలు వంటి నేరాలు, ఫోర్జరీ, రాబరీ, డ్రగ్స్‌కు సంబంధించిన ఎన్డీపీఎస్ కేసుల నమోదు, దర్యాప్తులో ఉన్న పురోగతి తదితర అంశాలపై సీపీ చర్చించారు. హత్యలు, స్నాచింగ్‌లు, మోసాలకు పాల్పడే ముఠాలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని, నిందితుల అరెస్టు చేయడంలో కాలయాపన జరగకుండా చూడాలని సూచించారు.
అనంతరం స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ), క్రైమ్ కంట్రోల్ స్టేషన్(సీసీఎస్) పనితీరుపై సమీక్షించారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లను వెంటనే పరిష్కరించి, హాబిట్యువల్ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసు అధికారులు, జ్యుడిషియల్ అధికారుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని, పోక్సో చట్టం అమలు పర్చడంతోపాటు అన్ని రకాల కేసుల్లో కన్విక్షన్ రేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ బి.రాజేశ్, క్రైమ్ డీసీపీ కె.నర్సింహ, సైబర్‌క్రైమ్ డీసీపీ శ్రీబాల, ఉమెన్ అండ్ చైల్డ్ సెక్యూరిటీ వింగ్ డీసీపీ సృజన, శంషాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ కె.రామ్‌కుమార్, ఎస్బీ అదనపు డీసీపీ రవికుమార్, సీసీఎస్ ఏసీపీ శశాంక్‌రెడ్డి, శంషాబాద్ ఏసీపీ కె.శ్రీనివాసరావు, షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి, శంషాబాద్ జోన్ ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు పాల్గొన్నారు.