సిటీబ్యూరో, ఆగస్ట్ 6(నమస్తే తెలంగాణ): ప్రాణాంతకమైన జన్యులోప సమస్యలను ముందుగానే గుర్తించేలా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నేషనల్ ఆలయన్స్ ఆఫ్ సికిల్ సెల్ ఆర్గనైజేషన్‌కు సీసీఎంబీ అడ్వైజరీగా వ్యవహరిస్తుండగా.., కొంత కాలంగా ఈ వ్యాధి నియంత్రణకు అవసరమైన పరిశోధనలు డా. జీఆర్ చందాక్ బృందం చేస్తోంది.
ఈ క్రమంలో సీసీఎంబీ డెవలప్ చేసిన ఆధునాతన డయాగ్నోసిస్ విధానాలను వినియోగంలోకి తీసుకువస్తున్నారు. చందాక్ లేబోరేటరీ రూపొందించిన పీసీఆర్ టెస్టింగ్ విధానాన్ని నాగ్‌పూర్ ఎయిమ్స్‌లో వాడనున్నారు. ఈ విధానం ద్వారా సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ వేగంగా చేసుకునే అవకాశం ఉంది. దీంతో వ్యాధి నియంత్రణకు సకాలంలో వైద్య చికిత్సలు అందించే వీలు ఉంటుందన్నారు. ప్రధానంగా గర్భస్థ శిశువులో ఉండే జన్యు లోపాలను గుర్తించే విధానాలను సీసీఎంబీ పరిశోధన బృందం అధ్యయనం చేస్తోంది.
నేషనల్ సికిల్ సెల్ ఎనిమియా మిషన్ కార్యక్రమంలో భాగంగా వ్యాధి నిర్ధారణ కోసం జాతీయ స్థాయిలో 25కు పైగా పలు పరిశోధన సంస్థలు కృషి చేస్తున్నాయి. అందులో ప్రముఖ స్వచ్ఛంద, వైద్యారోగ్య సంస్థలతో సీసీఎంబీ ఒకటిగా ఉంది. అయితే, సీసీఎంబీ డెవలప్ చేసిన పీసీఆర్ టెస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ సులభతరం అవుతుందంటున్నారు. ఈ క్రమంలోనే ఎయిమ్స్ – నాగ్‌పూర్‌తో కలిసి ఈ డయాగ్నోసిస్ సేవలను అందించనున్నట్లుగా సీసీఎంబీ వర్గాలు వెల్లడించాయి.