సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌ను వైర్లెస్ సిటీగా మారుస్తామంటూ పలు వేదికలపై ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందుకు కావలసిన సామగ్రిని సమకూర్చడంలో విఫలమవుతున్నారు. అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్, వైర్ల నిర్వహణకు భూగర్భడక్ట్ల ఏర్పాటుతో ఓవర్‌హెడ్ వైర్లకు చరమగీతం పాడుతామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆ కేబుల్ కొనుగోళ్లను కమీషన్ల కోసం నిలిపివేశారు. తమకు కావలసిన కమీషన్ రాకపోవడంతో గత కొన్ని నెలలుగా దక్షిణ డిస్కంలో కేబుల్ కొనుగోళ్లు లేక రెండు సమ్మర్యాక్షన్ప్లాన్లతో పాటు చాలా పనులు ఆగిపోయాయి. ప్రధానమైన పనులకు కావలసిన కేబుల్ దక్షిణ డిస్కం స్టోర్స్‌లో అందుబాటులో లేకపోవడంతో పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో అటు పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, గృహ అవసరాలకు నూతన విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొత్తగా ఇచ్చే కనెక్షన్లు ఏవైనా అండర్‌గ్రౌండ్‌లో ఇవ్వాలంటూ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పటివరకు నగరంలో యూజీ కేబుల్‌తో ప నులు జరగడం అసాధ్యంగా మారింది. కేవలం నగరశివారులో తప్ప ఈ యూజీ కేబుల్ పనులు ముందుకు సాగడం లేదు. శివారు ప్రాంతాల్లో కూడా యూజీ వేయడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కేబుల్ అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు డిస్కంపై ఒత్తిడి చేస్తున్నారు. స్థానిక అధికారులను కలిసి తమకు కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. సీఎండీ జితేశ్ వీ పాటిల్ దృష్టికి ఈ సమస్య వచ్చిన నేపథ్యంలో కమర్షియల్ విభాగానికి ఆయన సూచించిన మేరకు వినియోగదారులకు అవసరమైన కేబుల్‌ను అత్యవసరమైతే వారే తెచ్చుకోవాలంటూ టీజీఎస్పీడీసీఎల్ కమర్షియల్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
ముదిరిన కేబుల్ పంచాయితీ..!
దక్షిణ డిస్కంలో కేబుల్ పంచాయితీ రోజురోజుకు ముదురుతోంది. సంవత్సరం కాలంగా ముఖ్యమైన పనులకు అవసరమైన కేబుల్ లేకపోవడంతో అవన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డిస్కం ఉన్నతాధికారులు కానీ, సంబంధిత మంత్రి కానీ తాము పట్టిన పట్టు వీడకపోవడంతో కేబుల్ కంపెనీలతో ఒప్పందాలు కుదరక, కుదరిన కొన్ని ఒప్పందాలలో కూడా కొన్ని లోటుపాట్లతో నగరంలో అండర్‌గ్రౌండ్ పనులకు గ్రహణం పట్టింది. ఇదిలా ఉంటే వినియోగదారులు తమ కనెక్షన్ల పరిస్థితేంటంటూ ఒత్తిడి తేవడంతో మా దగ్గర కేబుల్ లేదు.. మీరే తెచ్చుకుని పనులు చేసుకోండంటూ చెప్పడంతో ఖంగుతినడం వినియోగదారుల వంతైంది.
డిస్కంకు సంబంధించిన స్టోర్స్‌లో గృహఅవసరాలకు, కమర్షియల్‌పరంగా అవసరమైన కేబుల్ లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు పెండింగ్‌లో పెట్టారు. దీంతో కొన్ని నెలలుగా తమ కనెక్షన్ల మాటేంటంటూ వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో కేబుల్ మీరు ఇవ్వకపోతే మేమే తెచ్చుకుంటామంటూ చెప్పినప్పటికీ కమర్షియల్ విభాగం పెద్దలు వారి అభ్యర్థనను చాలారోజులు పెండింగ్‌లో పెట్టి చివరకు అత్యవసరమైతే మీరే తెచ్చుకోండంటూ ఈనెల 11న కమర్షియల్ విభాగం చీఫ్ ఇంజనీర్ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు.
కట్టిన డబ్బులు పోయినట్లేనా..!
నల్లకుంటకు చెందిన ఓ భవన యజమాని తన బిల్డింగ్‌కు కావలసిన ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు కేబుల్ ఇతర సామగ్రి కలిపి రూ.10.02లక్షలు చెల్లించారు. ఇందులో 11కేవీ 3కోర్ 185 స్కేర్ మిల్లీమీటర్ల సైజ్ కలిగిన కేబుల్ 160మీటర్లకు గాను 1.89 లక్షలు చెల్లించారు. ఇందులో మీటర్‌కు రూ.1,185.90ల చొప్పున చెల్లించారు. కేబుల్‌తో పాటు పాలిమర్ పిన్ ఇన్సులేటర్లు ఇతర సామగ్రికి మరికొం త డబ్బులు చెల్లించారు. తాజాగా వచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో కనెక్షన్ తీసుకోవడానికి అవసరమైన కేబుల్‌ను కొనుగోలు చేసి అండర్‌గ్రౌండ్ నుంచి వేయాలంటే నగరంలో చాలా ఇబ్బందిగా ఉందని కాంట్రాక్టర్లు, భవన యజమానులు చెబుతున్నారు.
ఒకవైపు జీహెచ్ఎంసీ, మరోవైపు వాటర్‌బోర్డుకు సంబంధించి పైపులు ఉండటంతో యూజీ కేబుల్ వేయడానికి ఎక్కడ తవ్వాలో తెలియడం లేదని, ఎస్పీడీసీఎల్తో సమన్వయం లేకపోవడం కారణంగా సమస్య తీవ్ర త ఎక్కువైందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాము కేబుల్ కొనుగోలు చేసి వచ్చిన తర్వాత తమ డబ్బు లు తమకు తిరిగి ఇస్తారా అని అడిగితే కమర్షియల్ విభాగం అధికారులు పని మొత్తం పూర్తయ్యాక వచ్చి బిల్లు సమర్పిస్తే దానిని బట్టి తాము డబ్బులు ఎప్పుడు ఇచ్చేది చెప్తామంటున్నారని వినియోగదారులు అంటున్నారు. ఒకవేళ అప్పుడు కూడా బడ్జెట్ లేకపోతే తామేం చేయలేమని, ఎప్పుడైనా సద రు వినియోగదారుడికి సంబంధించిన విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉంటే వాటిని అడ్జస్ట్ చేసేందుకు ప్రయత్నించడం తప్ప తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారట.
ఎవరు జవాబుదారీ?
కమర్షియల్ విభాగం నేరుగా వినియోగదారులతో అనుసంధానమయ్యే విభాగం కావడంతో ఈ విభాగానికి సంబంధించిన డైరెక్టర్ కానీ అధికారులకు కానీ జవాబుదారీతనం ఉండాలికానీ సదరు డైరెక్టర్ ఈ విషయంలో ఎక్కడా ఆ తరహాలో వ్యవహరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా డిస్కంకు నష్టాలు తేవడమే కాకుండా వినియోగదారులకు కూడా చాలా సమస్యలు సృష్టిస్తున్నారంటూ డిస్కంలోనే చర్చ జరుగుతోంది. తాజా ఉత్తర్వుల విషయంలో కూడా పీఅండ్ఎంఎం కానీ ఇతర విభాగాల ప్రాతినిథ్యం లేకుండా నేరుగా కేబుల్ కొనుగోలు చేసుకోండి లేకుంటే తమ దగ్గర ఉన్న 300స్కేర్ ఎంఎం కేబుల్‌ను ఎక్కువ డబ్బులు చెల్లించి తీసుకోండంటూ చెప్తున్నారని, తమకు అవసరమైనదే కొనుగోలు చేస్తాం తప్ప అనవసరమైనది తమకెందుకని అడిగితే అయితే తాము ఇచ్చినట్లు తీసుకోండని చెప్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కేబుల్‌తో పాటు చిన్నచిన్న మెటీరియల్‌కు కలిపి కొన్ని నెలల క్రితమే లక్షల రూపాయలలో డీడీలు కట్టించుకున్న డిస్కం వాటిని తిరిగి చెల్లించడానికి మాత్రం ముఖం చాటేస్తోంది. తమ వద్ద బడ్జెట్ లేదంటూ అధికారులు వినియోగదారులకు చెప్పి ఒకవేళ ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే చూద్దామంటూ చెప్పడంతో వినియోగదారులు మండిపడుతున్నారు.