సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా స్పా, మసాజ్ సెంటర్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మాదాపూర్ నిర్వాహకులను డీసీపీ డా.వినిత్ హెచ్చరించారు. స్పా, మసాజ్ సెంటర్ల నిర్వాహకులతో శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన అవగాహన, సమన్వయ సమావేశంలో యాంటీహ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఎస్ఓటీ, మాదాపూర్ జోన్ పోలీసులతో కలిసి డీసీపీ వినిత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ పలు సూచనలు, హెచ్చరికలను స్పా, మసాజ్ సెంటర్ల నిర్వాహకులకు జారీ చేశారు. మానవ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, నగర ప్రతిష్టను దెబ్బతీసేలా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. స్పా/మసాజ్ సెంటర్లలో శృంగార కార్యకలాపాలు పూర్తిగా నిషిద్ధమన్నారు. ఈ సెంటర్లను ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల మధ్యనే నిర్వహించాలని, నివాసాలకు అనుసంధానంగా ఏర్పాటు చేయడం నిషేధమన్నారు. అర్హులైన ఫిజియోథెరపీ, ఆక్యుప్రెషర్, ఆక్యుపేషనల్ థెరపిస్టులను మాత్రమే మసాజ్, స్పా సెంటర్లలో నియమించాలని సూచించారు.
ఈ సెంటర్లలో పనిచేసే ప్రతి ఉద్యోగికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను మెయింటేన్ చేయాలని, 18ఏండ్లు నిండిన వారినే ఉద్యోగులుగా చేర్చుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటి ఫుటేజీ కనీసం 3నెలల పాటు స్టోరేజీ ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన, మాదాపూర్ ఎస్ఒటి డీసీపీ శోభన్‌కుమార్, అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ సత్యనారాయణ, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఏహెచ్‌టీయూ ఇన్స్పెక్టర్ జేమ్స్‌బాబు పాల్గొన్నారు.