సిటీబ్యూరో: సెప్టెంబర్ 2వ వారం నుంచి దేశంలో రుతుపవనాలు తిరోగమించడం ప్రారంభమైందని, ఈ ప్రభావంతోనే వరుసగా ఆవర్తనాలు, ద్రోణి, అల్పపీడనాలు వంటివి ఏర్పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రుతుపవనాలు తిరోగమించడం వల్ల ఆవర్తనాలు విదర్భా నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడటం వల్ల నగరంపై ఎక్కువగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అప్పటికప్పుడు ఆకస్మిక వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి వివరించారు.
రుతుపవనాల తిరోగమనం ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని, ఇవి దేశ వ్యాప్తంగా తిరోగమించడానికి మరో 15 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, వీటి ప్రభావంతో అక్టోబర్ 2వ వారం వరకు వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
బంజారాహిల్స్: మూడు రోజులుగా భారీ వర్షాలతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. దీంతో వరదనీరు పార్కులోంచి బయటకు వచ్చి బల్దియా వాక్‌వేను ముంచెత్తింది. వాక్‌వేలో నడుములోతూ నీరు నిలిచిపోవడంతో పాటు పార్కు బయట ప్రధాన రోడ్డుపైకి వరదనీరు ప్రవహించింది. వరదనీటిని మోటార్ల ద్వారా పార్కులోని కుంటలోకి పంపించారు హైడ్రా అధికారి మోహన్‌రావు తదితరులు ప్రధాన రోడ్డుపై నిలిచిపోయిన వరదనీటిని తొలగించేలా చూశారు.