Hyderabad | మన్సురాబాద్, ఫిబ్రవరి 28: నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లి.. ఓ కుమారుడికి భారంగా మారింది. కాలు కదపలేని స్థితిలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కర్కశకుడిగా మారిపోయాడు. కన్నతల్లి అన్న కనికరం లేకుండా వృద్దురాలిని అనాథలాగా రోడ్డున పడేశాడు. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటు రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధురాలిని కాలనీవాసులు చేరదీశారు. ఆమె దీనస్థితిని చూసి చలించిన వారు అన్నపానీయాలు అందించి ఆదరించారు. కాలనీవాసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు వృద్ధురాలిని అనాథ ఆశ్రమానికి చేర్చారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి మన్సురాబాద్ డివిజన్ చిత్రసీమ కాలనీలో వెలుగు చూసింది.
బాధితురాలి కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్ళపల్లి గ్రామం సమీపంలోని సీత్యా తండాకు చెందిన ధర్మీ(80)కి ముగ్గురు కుమారులు, కుమార్తె. ఇద్దరు కుమారులు చనిపోగా చిన్న కుమారుడైన లక్ష్మా నాయక్‌తో కలిసి ప్రస్తుతం ఎల్బీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. లక్ష్మా నాయక్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు చనిపోవడంతో చిన్న కుమారుడిపై ఆమె ఆధారపడింది. వృద్ధురాలైన తల్లి ఆలనాపాలన చూసుకోవాల్సిన కొడుకు.. తల్లిని భారంగా భావించాడు. ఎలాగైనా తల్లిని వదిలించుకోవాలని అనుకున్న లక్ష్మనాయక్.. గురువారం సాయంత్రం వృద్ధురాలిని ఆటోలో తీసుకువచ్చి మన్సురాబాద్, చిత్ర సీమ కాలనీలోని లిటిల్ చామ్స్ స్కూల్ సమీపంలో వదిలి వెళ్ళాడు.
దిక్కుతోచని స్థితిలో కాలనీలో తిరుగుతూ సదరు వృద్ధురాలు చిత్రసీమ కాలనీలోని రోడ్ నెంబర్ 4లో ఓ మూలన కూర్చుండిపోయింది. గురువారం రాత్రి పదిన్నర గంటలకు వృద్ధురాలిని గమనించి, కాలనీకి చెందిన బొప్పిడి కరుణాకర్ రెడ్డి, ఎస్.కె సైదా ఆమె వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కొడుకు ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళాడు అని మాత్రమే ఆమె చెప్పగలిగింది. కొడుకు ఎల్బీనగర్లో ఏ ప్రాంతంలో ఉంటుండో తెలపలేకపోయింది. దీంతో సదరు వృద్ధురాలికి వారు రాత్రి ఆశ్రయం కల్పించి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. వృద్ధురాలి కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసిన లాభం లేకపోవడంతో.. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని సదరు వృద్ధురాలిని అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని ఆలేటి అనాథ వృద్ధాశ్రమానికి తరలించారు. కన్న తల్లిని కొడుకు నడిరోడ్డుపై వదిలి వెళ్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. తల్లిని భారంగా భావించి నడిరోడ్డుపై వదిలిన కొడుకుకు బుద్ధి చెప్పాలని కాలనీవాసులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.