సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు స్టార్టప్లతోనే పరిష్కారం దొరుకుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం స్టార్టప్ విజయగాథలపై నిర్వహించిన వెబినార్లో పలువురు ఆంత్రపెన్యూర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకానమీ కలిగిన మూడో దేశంగా భారత్ ఎదిగిందన్నారు. ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడంలో ఎస్కీ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. వినూత్న రీతిలో అకాడమియా, స్టార్టప్, ఇండస్ట్రీ నిపుణులను ఒకే వేదికపై తీసుకువచ్చామన్నారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, జనరల్ మేనేజ్ మెంట్ అండ్ ఇండస్ట్రీయల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో రెండేండ్ల ఎంబీఏ కోర్సులను ఎస్కీ అందిస్తుందని వెల్లడించారు. ప్రత్యేక కోర్సులతో విద్యాభ్యాసం చేస్తే ఆంత్రప్రెన్యూర్లకు అవసరమైన శిక్షణ కూడా పొందవచ్చని తెలిపారు. రెస్టారెంట్ రంగంలో రాణిస్తున్న పాపా జాపాట సంస్థ అర్జున్ పంచల్ మాట్లాడుతూ… విదేశాల్లో విద్యాభ్యాసం చేసి, కార్పొరేట్ ఉద్యోగాలు సాధించినా స్టార్టప్ రంగంలో నిలుదొక్కుకోవడమే ఆనందంగా ఉందన్నారు. వ్యాపారం తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, నేడు నిలబడే సత్తా వచ్చిందంటే ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్నదేనని చెప్పారు. వెబినార్లో టాయ్ ట్రంక్ ఫౌండర్ అజయ్ వైద్య, స్పెక్ట్రాన్సిస్ సీఈవో కోట్యా నాయక్, వేర్ యూ ఎలివేట్ ఫౌండర్ రిషబ్, వరంగల్ రూరల్ ఇన్నోవేటర్ యాకర గణేశ్ తదితరులు పాల్గొన్నారు.