తెలుగు యూనివర్సిటీ, జనవరి 31. బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ సమస్యలను గత ఏడాదిగా ప్రభుత్వానికి విన్నవించుకున్నా నేటికీ పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయమని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రెంటల్ అగ్రిమెంట్ లీజ్ డీడ్ రెన్యువల్ పేరిట ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు వేధిస్తున్నారని వారు వాపోయారు. నాంపల్లిలోని అబ్కారీ భవన్ ఎక్సైజ్ శాఖ కమీషనర్ సి. హరికిరణ్‌ను శుక్రవారం సాయంత్రం కలిసిన అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో లీజ్ డీడ్‌పై స్టాంపు డ్యూటీ వసూలు చేసి రెన్యువల్ చేసేవారని గుర్తు చేశారు. వెన్షాపులకు పర్మిట్ రూమ్‌ల విషయంలో ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా రెంటల్ అగ్రిమెంట్ రిజిస్టర్ సమస్యను పరిష్కరిస్తామని వైన్‌షాపుల పర్మిట్ నిబంధనలు అమలు చేస్తామని కెఎఫ్ బీర్ రేషన్ వారం రోజుల్లో తీసుకోవచ్చని కమిషనర్ హరికిరణ్ తెలిపినట్లు దామోదర్ వెల్లడించారు.
టిఎస్బీసీఎల్ జీఎం అబ్రహాంను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవడంతో పాటు సిరిసిల్ల జిల్లాలో జరిగిన బార్ సంఘటన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని హామీనిచ్చినట్లు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు ఐకమత్యంగా ఉంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చని దామోదర్ గౌడ్ సూచించారు. కమీషనర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు ప్రధాన కార్యదర్శి పి. రాజుగౌడ్, గౌరవ అధ్యక్షులు జి. విజయకుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు ఇ.రామకృష్ణ, సంయుక్తకార్యదర్శి మోహన్‌గౌడ్, ఆంజనేయులు గౌడ్, సిరిసిల్ల జిల్లా నాయకులు మారుతీ, కోదాడ నాయకులు పాల్గొన్నారు.