గోల్నాక, మే 18: ఉద్యోగం ఇప్పిస్తానని సోషల్ మీడియాలో ఓ నిరుద్యోగ మహిళను నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అంబర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కూకట్‌పల్లిలో నివాసముండే టి.కిశోర్(30).. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈజీ మనీకి అలవాటుపడ్డ కిశోర్ ఫేస్బుక్ ద్వారా అంబర్‌పేటకు చెందిన ఓ నిరుద్యోగ మహిళలకు పరిచయమయ్యాడు.
ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, వాట్సాప్ ద్వారా నకిలీ జాయినింగ్ ఆర్డర్లు పంపి, వివిధ ఫేక్ బ్యాంకు ఖాతాల్లో రూ.2లక్షల 30 వేలు జమచేయించుకుని మోసానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు కిశోర్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.2లక్షల నగదు, మరో రూ.25వేలను అతని బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేశారు. సోమవారం కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబర్‌పేట ఇన్స్పెక్టర్ టి.కిరణ్‌కుమార్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు డబ్బులు పంపొద్దని సూచించారు.