గోల్నాక, మే 18 : హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ సోషల్ మీడియా ద్వారా ఓ నిరుద్యోగ మహిళను నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను అంబర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కూకట్‌పల్లిలో నివాసముండే టి.కిశోర్(30).. ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈజీ మనికి అలవాటు పడ్డ కిశోర్ పేస్ బుక్ ద్వారా అంబర్‌పేటకు చెందిన ఓ నిరుద్యోగ మహిళలకు పరిచయమయ్యాడు.
ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం వాట్సాప్ ద్వారా నకిలీ జాయినింగ్ ఆర్డర్లు పంపి వివిధ ఫేక్ బ్యాంకు ఖాతాల్లో రూ.2లక్షల 30 వేలు జమచేయించుకుని మోసానికి పాల్పడ్డాడు. బాధితు రాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు కిశోర్ అరెస్ట్ చేసి అతని వద్ద రూ.2లక్షల నగదు, మరో రూ.25వేల అతని బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేశారు. సోమవారం కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
ఈ నేపథ్యంలో అంబర్‌పేట ఇన్స్పెక్టర్ టి.కిరణ్‌కుమార్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలను నమ్మెద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు డబ్బులు పంపొద్దని సూచించారు. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు.