Osmania Hospital | సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 22 : ఉస్మానియా దవాఖాన పాత భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని డాక్టర్స్ క్యాంటీన్ వద్ద పాము కలకలం రేపింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో నుంచి కొట్టుకువచ్చిన పాము శనివారం రాత్రి డాక్టర్స్ క్యాంటీన్లో ప్రత్యక్షమై అందరినీ కలవరానికి గురిచేసింది. పాము అక్కడే తిరుగుతుండటంతో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది భయంతో పరుగులు తీశారు.
డాక్టర్స్ క్యాంటీన్ పక్కనే ఉన్న గదిలో శిథిలావస్థకు చేరిన స్ట్రెచర్లు, వీల్ చైర్స్, ఇతర పరికరాలను కొంత కాలంగా నిల్వ చేశారు. క్రమంగా వ్యర్థాలు పెరుగడంతోనే తరచూ పాములు వస్తున్నాయని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తించిన సిబ్బంది క్యాంటీన్‌కు తాళం వేసి… స్నేక్ సొసైటీ సభ్యుడు గణేశ్‌కు విషయం చెప్పారు. వెంటనే గణేశ్ అక్కడికి చేరుకొని పామును సంచిలో బంధించి తీసుకెళ్లారు. సాధారణంగా పాము కాటు వేస్తే వైద్య చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు వస్తారు. కానీ, దీనికి భిన్నంగా ఉస్మానియాలోనే పాములు తరుచూ సంచరిస్తుండటంతో వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులు, రోగి సహాయకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.