సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : కరోనాతో మనుషుల మధ్య బంధాలు మాయమాయ్యాయి. ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరిని ముట్టుకోవాలన్నా ఒక్కటే భయం. ఎక్కడ కరోనా సోకుతుందోనన్న ఆందోళనే. ఆధునిక సమాజంలో కరోనా మీద కాస్త అవగాహన ఉన్నా మహమ్మారి సోకితే ఎక్కడ చికిత్స తీసుకోవాలి ? ఏ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా ఉన్నాయి ? మరి రక్తం అవసరం ఉంటే ? కరోనా తగ్గిన తర్వాత ప్లాస్మా కావాలంటే ? వ్యాక్సిన్ ఎలా బుకింగ్ చేసుకోవాలి ? అన్నదానిపై చాలామందికి అవగాహన లేదు. కరోనా నిర్ధారణ నుంచి చికిత్స వరకు అంతా ఆన్లైన్లోనే. మరీ అందరికీ ఇంటర్నెట్ వాడకంపై అవగాహన ఉంటుందా? లేని వారి పరిస్థితి ఏమిటి ? వారికి సమాచారం ఎలా తెలియాలి? డాక్టర్లను ఆన్లైన్లో సంప్రదించాలంటే ఎలా? పోస్ట్ కొవిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తున్నది ఐటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఫోరం. 10 మంది సభ్యులతో ఏర్పడిన ఈ ఫోరం కొవిడ్‌కు సంబంధించిన ప్రతీ అంశం మీద సేవలందిస్తున్నది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, లండన్ వైద్యులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసింది.
ఆపదలో ఉన్నవారు, డాక్టర్ సేవలు అవసరం ఉన్నవారు 8463912345 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు వారికి కావాల్సిన సహాయం అందుతుంది. ఆహారం అవసరమున్నా ఇంటికి భోజనం అందేలా టెక్నాలజీ వినియోగంతో దాతలను వెతికిపెడుతారు. ప్రధానంగా వ్యాక్సిన్ కోసం, ఆస్పత్రుల్లో బెడ్ల కోసం అధికంగా సంప్రదిస్తున్నారు.
నా భార్యకు కరోనా సోకింది. ఆ సమయంలో నేను, నా కొడుకు చరణ్(5) హోటల్లో ఉన్నాం. ‘డాడీ మనం అమ్మకు దూరంగా ఎందుకు ఉన్నాం? అమ్మకు ఆరోగ్యం బాగులేకపోతే ఎవరు చూసుకుంటారు? అని ప్రశ్నించాడు. ఆ మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. చాలామంది కొవిడ్‌తో బాధపడుతుంటారు. వారికి దైర్యం, సేవ అందించే వారు కావాలని భావించాను. అందుకే మా ఫోరంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రారంభించాం. ఎవరికి అవసరమున్నా ఫుడ్ నుంచి వ్యాక్సిన్ వరకు సాయమందేలా చూస్తున్నాం. – శ్రీధర్ మెరుగు, ఫౌండర్, ఐటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఫోరం
ఆపద సమయంలో ప్రతిఒక్కరూ అండగా ఉండాలి. ఏదో రకంగా సాయం చేయాలి. కొవిడ్ ప్రస్తుతం భయానక పరిస్థితులను సృష్టించింది. ఐటీ ఉద్యోగులు తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. ప్రస్తుతమంతా టెక్నాలజీ ఆధారిత సేవలే ఉన్నాయి. వాటిపై అవగాహన ఉన్నవారు ఇతరులను గైడ్ చేయాలి. వైద్యులు, సైకాలజిస్టులు, రక్త, ప్లాస్మా, ఆహార దాతలు ఉన్నారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు అవసరమైన సాయం అందిస్తాం. – బిను, సభ్యురాలు