ఈ క్షణం వరకే మనం సేఫ్.. కండ్లు మూసి తెరిస్తే.. ఏం జరుగుతుందో తెలియదు.. మృత్యువు ఏ మలుపు నుంచి ముంచుకొస్తుందో.. ఎటువైపు నుంచి దూసుకువస్తుందో తెలియదు.. మన ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.. కానీ సీటు బెల్టు పెట్టుకుంటే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చని తెలిసినా.. చాలా మంది ఆ పనిని అంతులేని నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తుంటారు. ఇంటి పెద్ద దిక్కు ప్రాణాలు గాల్లో కలిసి.. వారి కుటుంబాన్ని మొత్తం అనాథలుగా మారుస్తారు. అందుకే రోడ్డెక్కామంటే.. గమ్యం చేరేవరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే.. ముఖ్యంగా సీటుబెల్టు పెట్టుకోవాల్సిందే. చిన్న బెల్టు మీ ప్రాణాలను కాపాడటంతో పాటు.. మీ కుటుంబం రోడ్డున పడకుండా ఆపుతుందని మర్చిపోవద్దు.
Seat Belt | సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ): రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరోవైపు వాహనాలు ఫిట్నెస్గా లేకపోవడం కూడా ప్రమాదాలకు దారి తీస్తుంది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్నారు. అంతేకాకుండా వారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సురక్షిత డ్రైవింగ్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండేల ట్రాక్స్ ఎస్ సొసైటీ, క్యాబ్ అసోసియేషన్ సంస్థలు కృషి చేస్తున్నాయి.
సెల్ఫీ విత్ సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించండి తదితర స్లోగన్స్‌తో సోషల్ మీడియాలో సైతం అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు వాహన పనితీరులో చాలా ముఖ్యమైన టైరు పరిస్థితిపై డ్రైవర్లకు అవగాహన ఉండాలని సూచిస్తున్నారు. కారు టైరు ఎందుకు పేలుతుంది.? టైరులో గాలి ఎంత ఉండాలి? ఎయిర్ ప్రజర్ లోపం ఉంటే ఏమవుతుంది? టైర్ల నాణ్యత ఎలా తెలుసుకోవాలి? సీటు బెల్ట్ పెట్టకపోతే? బెలూన్స్ పనితీరు ఎలా ఉంటుంది? తదితర వాటిపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
కారెక్కగానే సీటు బెల్టు ధరించాలి. లేకుంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కోసారి ప్రాణాలే పోతాయి. అందుకే సీటు బెల్టు పెట్టుకోకపోతే అలారం మోగి మరీ హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కార్లలో అమర్చాయి వాహన తయారీ సంస్థలు. కొన్నింటిలో అయితే ఇంజిన్ కూడా స్టార్ట్ అవ్వదు. మన భద్రత కోసమే ఇదంతా.. కానీ కొందరు సీటు బెల్టు పెట్టుకోవడాన్ని నామోషిగా భావిస్తున్నారు. సౌండ్ రాకుండా మార్కెట్లో దొరుకుతున్న చీటర్ అనే పరికరాన్యని సీటు బెల్ట్ బకెల్‌కి అమర్చుతారు. సీటు బెల్ట్ బకెల్ను లాక్‌లో పెట్టకుండా ఈ పరికరంలో అమరిస్తే హెచ్చరికల బజర్ మోగదు. కారు యాక్ససరీలు అమ్మే అన్ని దుఖానాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే బకెల్ అమర్చి.. అలారంను మనం మోసం చేస్తే అది మన జీవితాన్ని లేకుండా చేస్తుందని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
సీటు బెల్ట్‌ను మోసం చేస్తే అది మన ఆయుష్షునే ఆపేస్తుంది. సీటు బెల్ట్ పెట్టుకోవడం మన బాధ్యత. అందుకే మేం సెల్ఫీ విత్ సీట్ బెల్ట్ అనే ప్రచారం చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యువత అతివేగంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ తీసుకోవాలి.
– షేక్ సలావుద్దీన్, సెల్ఫీ విత్ సీట్ బెల్ట్ ప్రచార కర్త
కారు మోడల్‌ను బట్టి టైర్లు.. వాటి పరిమాణాన్ని బట్టి ఎయిర్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా 32 పాయింట్లతో గాలి నింపితే సరిపోతుంది. కారు ఎక్కువగా వాడే వారు నిర్వహణపై మరింత శ్రద్ధ వహించాలి. ఎక్కువగా వినియోగించని వాళ్లు కనీసం పది నుంచి 15 నిమిషాలు కారును స్టార్ట్ చేసి ఉంచాలి. దీనివల్ల టైర్లు డ్యామేజీ అవకుండా ఉంటాయి. ఇలా నెలకు రెండుసార్లు అయిన చేయాలి. టైర్లు నాణ్యతగా ఉంటే అతివేగంలో ఉన్నా వెహికిల్‌ను కంట్రోల్ చేయగలం.
– నాయుడు, మారుతీ షోరూం