సిటీబ్యూరో, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రాత్రి, పగలు తేడా లేకుండా సెల్‌ఫోన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై కత్తులతో దాడి చేస్తున్నారు. నాలుగు నెలల కిందట గుడిమల్కాపూర్, వారం రోజుల కిందట సికింద్రాబాద్‌లో.. ఇద్దరు వ్యక్తులు సెల్‌ఫోన్ స్నాచర్ల దాడుల్లో మృత్యువాత పడ్డారు. తాజాగా.. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఒక న్యాయవాది కల్యాణ్ వంశీకర్పై సెల్‌ఫోన్ స్నాచర్లు కత్తులతో దాడి చేయడం ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడి కంటే ముందే అబిడ్స్‌లో సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు ఈ ముఠా పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, న్యాయవాదిపై సెల్‌ఫోన్ స్నాచర్లు దాడి చేశారా?, మత ఛాందస్సు వాదులు దాడి చేశారా? అనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఇది ముమ్మాటికి సెల్‌ఫోన్ స్నాచర్ల పనే అంటుండగా, న్యాయవాదిని లక్ష్యంగా చేసుకొని హత్యకు కుట్ర చేశారని వీహెచ్‌పీ ఆరోపించింది. వీహెచ్‌పీ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు.
భయం.. భయం.!
ఉమ్మడి రాష్ట్రంలో చైన్ స్నాచింగ్ ఘటనలతో ఒంటరిగా మహిళలు రోడ్డుపై నడువలేని దుస్థితి ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదిద్ది.. ప్రజలకు స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి హైదరాబాద్ పోలీసింగ్ విధానాన్ని మసకబారే విధంగా తయారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఒక సిస్టమ్‌ను అభివృద్ధి చేసినప్పుడు బాగున్నదానిని తరువాత వచ్చే అధికారులు కొనసాగించాలి. కానీ, ఒక అధికారి ప్రవేశపెట్టిన విధానాలను నేనెందుకు అమలు చేయాలనే ధోరణితో కొందరు అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలతో.. పదేండ్లు బాగున్న పోలీస్ సిస్టమ్ తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గుర్తు చేస్తున్నదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెల్‌ఫోన్ స్నాచింగ్ మాఫియా.!
సెల్‌ఫోన్ స్నాచింగ్ మాఫియా నగరంలో తమ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థ గాడితప్పడం, క్షేత్రస్థాయిలోని పోలీసు అధికారులు.. ఉన్నతాధికారులు ఆశించినంత స్థాయిలో పనిచేయకపోవడం, ప్రత్యేక విభాగమైన టాస్క్‌ఫోర్స్ నిద్రావస్తలో ఉంటూ తమ సొంత వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వంటి ఘటనలతో సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠాలను అణిచివేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఖైరతాబాద్‌లో జరిగిన ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. అర్ధరాత్రి వేళ నడుచుకుంటూ వెళ్లడానికి భయపడే రోజుల నుంచి ఉదయం వేళ ఇంటి వద్ద కూడా నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితికి హైదరాబాద్ మారిపోయిందంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠాలపై పటిష్ట నిఘా పెట్టి అణిచివేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.