Hyderabad | చర్లపల్లి, జూలై 21: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) పరిశ్రమలోని క్యాంటీన్ సాంబర్లో శుక్రవారం పాము కనిపించింది. దీంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురైనట్లు తెలిసింది. పరిశ్రమలోని ప్రధాన క్యాంటీన్లో నిత్యం వంట కార్మికులు.. ఉద్యోగుల కోసం వంట వండి వడ్డిస్తారు. క్యాంటిన్లో వంట చేసిన అనంతరం ఇతర డివిజన్లకు భోజనం పంపిణీ చేస్తారు.
శుక్రవారం క్యాంటిన్లో వంట చేసిన అనంతరం ఈఎంఎస్‌డీ డివిజన్‌కు యథావిధిగా క్యాంటీన్ సిబ్బంది భోజనాన్ని పంపించారు. అక్కడ కార్మికులు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా, సాంబర్లో ఉడికిన పాము కనిపించింది. వెంటనే కార్మికులు యూనియన్ నాయకులకు, యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే ఈఎంఎస్‌డీ డివిజన్‌కు వచ్చిన అధికారులు ఇతర డివిజన్లకు సమాచారం అందించి.. సాంబర్‌ను వడ్డించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈఎంఎస్డీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఇంజక్షన్స్, మందులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.