విద్యార్థుల్లో సృజనాత్మకతకు పదును
మేడ్చల్, జూలై 13 (నమస్తే తెలంగాణ): విద్యార్థులలో సృజనాత్మకత, అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుకు 90 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. ఎస్టీఈఎం సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ గణితంకు సంబంధించిన ల్యాబ్‌లు (స్మార్ట్ క్లాస్రూమ్) ఏర్పాటు కానున్నాయి. ఇందులో శాస్త్ర సాంకేతిక, గణిత అంశాల పాఠ్యపుస్తకాలను పొందుపరిచి డిజిటల్ టీవీల ద్వారా విద్యార్థులకు బోధించనున్నారు. దీనికితోడు గ్రంథాలయాలు ఏర్పాటు చేసి, డిజిటల్ టీవీలో పొందుపర్చిన పాఠ్యపుస్తకాల ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పొందే విధంగా సిద్ధం చేస్తున్నారు.
డిజిటల్ టీవీల ద్వారా విద్యార్థులు ఎలా చదువుకోవచ్చనే అంశంపై ఎంపిక చేసిన 90 పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన ఈ ఉపాధ్యాయులు చదువుకునే విధానాన్ని విద్యార్థులకు వివరించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలలోని ఎంపిక చేసిన 90 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పరికరాలు చేరుకున్నాయి. త్వరలోనే స్మార్ట్‌క్లాస్ రూమ్‌లు ప్రారంభం చేసే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక సహాయంతో..
ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక సహాయంతో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ- సమగ్రశిక్ష, సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నారు. 90 పాఠశాలలకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించంగా.. సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ పరికరాలు బిగించే వంటి పనులు చేపట్టి విద్యార్థులకు డిజిటిల్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి దశలో 90 పాఠశాలల్లో స్మార్ట్ క్లాసు రూమ్‌లు ఏర్పాటు కానున్నాయి. త్వరలోనే మరిన్ని పాఠశాలలను కూడా ఎంపిక చేయనున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా స్మార్ట్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్లాస్‌రూమ్‌లో విద్యార్థులకు సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితంలో మరింత పదును పెట్టేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందిస్తున్న ఆర్థిక సహాయంతో సెవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ, విద్యాశాఖ- సమగ్రశిక్ష నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో అంచనాకు మించి అడ్మిషన్లు వచ్చాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం.
– విజయ కుమారి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి