ఖైరతాబాద్, మే 16: నిమ్స్ ఇమ్యూనాలజీ, రూమటాలజీ పీడియాట్రిక్ విభాగంలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల కంటి పరీక్షల కోసం ఉపయోగపడే విలువైన పరికరాన్నిఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ బహూకరించింది. ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకటైన జూవనైల్ ఇడీయోపతిక్ ఆర్థరైటీస్ (జీఐఏ)తో బాధపడే చిన్నారులకు కంటి చూపు సమస్య తలెత్తుంది. నిమ్స్ ఇమ్యూనాలజీ, రూమటాలజీ పీడియాట్రిక్ విభాగంలో ఈ సమస్యతో బాధపడే చిన్నారులకు చికిత్సను అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారి కంటి పరీక్షల కోసం స్లిట్ ల్యాంప్ ఎంతో ఉపయోగపడుతుంది. శుక్రవారం ఈ పరికరాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటీవ్ చైర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ పీడియాట్రిక్ రుమటాలజీ విభాగంలో జీఐఏ సమస్యతో చికిత్స తీసుకున్న చిన్నారులు కంటి పరీక్షల కోసం ఇతర ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ బహూకరించిన ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎల్వీ ప్రసాద్ ఆప్తమాలజిస్టులు ప్రతి మంగళవారం ఈ పరికరంతో పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ డాక్టర్ లీజా రాజశేఖర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ బసు, డాక్టర్ షప్తాప్, పీడియాట్రిక్ రుమటాలజీ విభాగం వైద్యురాలు డాక్టర్ కీర్తివర్ధన్ పాల్గొన్నారు.