సిటీ బ్యూరో, జూబ్లీహిల్స్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): : దళితులకు అసలైన ఆయుధం విద్యనే. వారి అభివృద్ధికి అదే ఆయువు పట్టు అని అంబేద్కర్ ఆనాడే భావించారు. ఆయన ఆశయ సాధనకు పూనుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవైపు అడుగులు వేశారు. దళితులకు విజ్ఞానం పంచాలనే సదుద్దేశంతో రహ్మత్‌నగర్‌లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌ను నిర్మించారు. సకల వసతుల కల్పనతో మాగంటి పర్యవేక్షణలో ఆ భవనం ఎప్పుడో పూర్తి అయ్యింది. ఇక పుస్తకాలతో కుస్తీ పట్టి భవిష్యత్తును చక్కదిద్దుకోవచ్చని కలలు కన్న దళిత యువత ఆశలు అడియాశలుగా మిగులుతున్నాయి. సీడీఎస్‌ను ప్రారంభించకుండా యువత నైపుణ్యాల అభ్యసనకు ‘రేవంత్ గ్రహణం’ అడ్డు తగులుతున్నది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేపట్టిన నిర్మాణాలు దేశానికే ఐకానిక్‌గా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వెంటనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణ దళిత యువతకు కేసీఆర్ గొప్ప కానుక అందించారు. యువత అన్ని రంగాల్లో ముందుండాలనే దృఢ సంకల్పంతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ పేరిట ప్రపంచ స్థాయి హంగులతో భవనాన్ని నిర్మించారు. అందుకు జూబ్లీహిల్స్‌లోని రహ్మత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్‌ను వేదిక చేశారు. హైదరాబాద్‌లోనే ఎత్తయిన ప్రాంతంలో ఉన్న జూబ్లీహిల్స్‌లో 27 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం సహా 6 అంతస్థుల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ చొరవ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సంకల్పంతో సీడీఎస్ భవన నిర్మాణం పూర్తి చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దళిత యువత నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు దోహదపడే దళిత విజ్ఞాన భాండాగారాన్ని ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నది. దళిత యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నది.
అంబేద్కర్ ఆశయాలకు అద్దం పట్టేలా సీడీఎస్ అధ్యయన కేంద్రాన్ని మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్మించారు. 1500 గజాల స్థలంలో ఆధునిక హంగులతో ఏర్పాటు చేశారు. అధ్యయన కేంద్రంలో మహారాష్ట్ర శిల్పులు చెక్కిన 27 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భవనంలో 2 సెల్లార్లు, 2 గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు అంబేద్కర్ ఆచరించిన బౌద్ధం ఉట్టిపడేలా ఆరు అంతస్థుల భవనం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. మొత్తం నిర్మాణానికి రూ.28 కోట్లు వెచ్చించారు. ఈ భవనంలో నిత్యం శిక్షణ కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు జరగడానికి అన్ని సౌకర్యాలను కల్పించారు. విశాలమైన సమావేశ మందిరం, గ్రంథాలయం, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు 300 మంది కూర్చొనే ఆడిటోరియం, శిక్షణార్థుల వసతి కోసం 13 గదులు ఉన్నాయి. అబ్బురపరిచే దళిత మ్యూజియంతో పాటు టెర్రాస్‌లో అంబేద్కర్ విగ్రహానికి సరి సమానంగా కాన్స్టిట్యూషన్ పిల్లర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది.
తెలంగాణ దళితులపై కక్ష గట్టిన సీఎం రేవంత్‌రెడ్డి సీడీఎస్‌ను ప్రారంభించకుండా నిర్వీర్యం చేస్తున్నారు. దళితులు మేధావులు కావడం ఇష్టం లేకనే ప్రారంభం నిలిపేశారని యువత మండిపడుతున్నారు. ఇప్పటికే దేశంలోనే ఎక్కడాలేని విధంగా మాజీ సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చి దళితుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సీడీఎస్‌ను అందుబాటులోకి తీసుకొస్తే దళితుల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్తశుద్ధి మరింత పెరుగుతుందనే అక్కసుతోనే ప్రారంభించకుండా వదిలేశారని దళిత యువత ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి పలుమార్లు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సందర్శనలకే పరిమితమయ్యారు. అధ్యయన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్న వారి వాగ్దానాలు గాలి మాటలుగానే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే యువత శిక్షణతో అధ్యయన కేంద్రం కళకళలాడేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు, యువతకు ఉపయోగపడే పనులను పక్కన పెట్టి ఎలాంటి ప్రయోజనాలు లేని పనులు చేస్తూ కాంగ్రెస్ పాలకులు కాలం వెళ్లదీస్తున్నరని విమర్శిస్తున్నారు.
తెలంగాణ దళిత యువత ఎదుగుదల నచ్చకనే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురాకుండా నిర్వీర్యం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం భవన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చినా… ప్రారంభించకపోవడమేంటి? ఇది దళితులను అవమానించడం కాదా? దళిత యువత చదువుకుని, మేధావులు కావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఇష్టం లేదు. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్తాం. – తరుణ్, రహ్మత్‌నగర్
కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దళితులంటే ఎందుకు అంత చులకన? బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో దళితులకు అందాల్సిన ఫలాలను అడ్డుకోవడం మూర్ఖత్వం. దళిత యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కేసీఆర్ కోరుకుంటే.. రేవంత్‌రెడ్డి మమ్మల్ని మరింత అణచివేయడానికి కంకణం కట్టుకున్నట్లుంది. రెండేండ్లలో దళితుల కోసం ఏమీ చేయకపోగా.. గత ప్రభుత్వం చేపట్టిన పనులను అమలు చేయడానికి ఎందుకంత కక్ష. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు చిత్త శుద్ధి లేదా? వారికి కళ్లు కనిపించడం లేదా? వాళ్లకు పదవులు ఉంటే సరిపోతుందా? దళితుల పట్ల ఏమాత్రం వివక్ష లేకుంటే వెంటనే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలి.
– విజయ్ కిరణ్, రహ్మత్‌నగర్