ఘట్కేసర్, అక్టోబర్ 26ః ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్లు నీటి గుంతలో పడి దుర్మరణం చెందారు. ఆదివారం సెలవు దినం కావటంతో తల్లిదండ్రులు ఊరు వెళ్లగా పశువులకు నీళ్లు తాపడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంకుషాపూర్‌కు చెందిన కొండల మల్లేష్ కుమార్తెలు హరిణి(16), గాయత్రి(13)లు ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో నివాసం ఉంటున్నారు. మధ్యాహ్నం సమయంలో అక్కా చెల్లెళ్లు పశువులకు నీళ్లు తాపడానికి సమీపంలోని ప్రశాంత్‌నగర్ గుట్టల మధ్య ఉన్న కుంటలోకి వెళ్లి గల్లంతయ్యారు.
సాయంత్రం ఇంటి వచ్చిన మల్లేష్‌కు కుమార్తెలు కనిపించకపోవటంతో చుట్టుపక్కల వెతకగా నీటి గుంత వద్ద చెప్పులు, చున్నీలు కనిపించాయి. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇద్దరు బాలికల శవాలు నీటి గుంతలో లభించాయి. మృతి చెందిన కుమార్తెలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.