శేరిలింగంపల్లి, డిసెంబర్ 17: బీపీ, డయాబెటిస్తో 8 ఏండ్లుగా బాధపడుతూ తీవ్ర అనారోగ్య సమస్యలతో క్లిష్ట పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరిన ఓ వ్యక్తికి ఒకే సమయంలో కాలేయం, కిడ్నీ మార్పిడిని స్టార్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించి స్టార్ వైద్య బృందం మంగళవారం నానక్‌రాంగూడ స్టార్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒంగోలుకు చెందిన ఉపాధ్యాయుడు సమ్మినేని రామారావు(54) 8 ఏండ్లుగా బీపీ, మధుమేహంతో బాధపడుతున్నాడు. కాగా, ఇటీవల రామారావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్లో చేరాడు. పూర్తిగా మూత్రం నిలిచిపోవడంతోపాటు బీపీ, షుగర్ దీర్ఘకాలిక వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్న అతడిని వైద్యులు పరీక్షించగా.. అతడి కిడ్నీ, లివర్ రెండు అవయవాలు మార్చాల్సిన పరిస్థితి నెలకొన్నది.
దీంతో స్టార్ హాస్పిటల్ లివర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, లివర్ స్పెషలిస్టు మెట్టు శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ మెంటర్ డాక్టర్ రవీంద్రనాథ్, నెఫ్రాలజీ విభాగ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి నిపుణుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రామారావుకి లివర్, కిడ్నీలను ఇచ్చేందుకు తన కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. రామారావు భార్య నాగవల్లి కిడ్నీ, కొడుకు కేశవ్ లివర్ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఒకే సమయంలో రామారావుకి స్టార్ హాస్పిటల్లో లివర్, కిడ్నీ రెండు అవయవాల మార్పిడి అరుదైన శస్త్రచికిత్సను దాదాపు 12 నుంచి 14 గంటలు శ్రమించి స్టార్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. పది రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచిన రామారావు సాధారణ జీవితం గడిపేలా మెరుగైన వైద్యసేవల అనంతరం డిశ్చార్జి చేసినట్లు స్టార్ వైద్యులు పేర్కొన్నారు. రోగి రామారావుతోపాటు అతడి భార్య నాగవల్లి, కొడుకు కేశవ్ ఆరోగ్యం ఉన్నారని తెలిపారు. చాలా అరుదైన మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని స్టార్ వైద్య బృందం పరస్పర సహకారంతో టీమ్ వర్క్‌తో ఈ అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేసినట్లు తెలియజేశారు.
అవయవదానంపై అపోహలు వద్దు..
ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో చాలా మంది అవయవదానానికి ముందుకురావడం లేదని, చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్‌గా ఉన్నా సరైన అవగాహనలేక అవయవదానాలకు ఇష్టపడటం లేదని స్టార్ లివర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ మెంటర్ డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా రోగి రక్త సంబంధీకులు, కుటుంబసభ్యులు మాత్రమే క్లిష్ట పరిస్థితుల్లో ఇలా ముందుకు వస్తున్నారని, అవయవమార్పిడికి దేశంలో అనేక అధునాతన సౌకర్యాలు, వైద్యసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజల్లో అవయవదానాలపై అపోహాలు ఉండటంతో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని స్టార్ లివర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ మెంటర్ డాక్టర్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్న రామారావు మాట్లాడుతూ.. తాను అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ప్రాణంపై ఆశవదులుకొని హాస్పిటల్‌కు రావడం జరిగిందని, స్టార్ వైద్యబృందం తనకు, తన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి తనకు పునర్జన్మను ప్రసాదించారని తెలిపారు. భార్య నాగవల్లి, కొడుకు కేశవ్‌లతో పాటు తనకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.