Power Demand | సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మండుతున్న ఎండలతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండటంతో అదే స్థాయిలో విద్యుత్ వినియోగం గ్రేటర్ పరిధిలో పెరిగింది. ఈనెల 8న 65 మిలియన్ల యూనిట్ల వినియోగం జరగ్గా, అదే సమయంలో గతేడాది ఫిబ్రవరి 55 మిలియన్ యూనిట్లకు మించలేదు. దీంతో ఏడాది ఫిబ్రవరి నుంచి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతేడాదితో పోల్చుకుంటే జనవరిలో 9.47 శాతం, ఫిబ్రవరిలో 12.27 శాతం అధిక వినియోగం నమోదైందని తెలిపారు. 2023 ఫిబ్రవరిలో గరిష్ఠ విద్యుత్ డిమాండు 2930 మెగా వాట్లు ఉండగా, 2024 ఫిబ్రవరి 23వ తేదీ నాటికి 3174 మెగావాట్లు నమోదైంది. ఏటా వేసవిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతూనే ఉంటుందని, దానికి అనుగుణంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి వేసవి డిమాండును తట్టుకునేలా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకొని అవసరమైన పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డీటీఆర్లు, కొత్త లైన్లను ఏర్పాటు చేసే పనిలో విద్యుత్ యంత్రాంగం నిమగ్నమైంది.