రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సుపరిచితమైన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సహాయకులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. కొవిడ్ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో సరిపడా పడకలు సిద్ధం చేసినా కూడా సరిపడా సిబ్బంది లేకపోవడం గమనార్హం. 1168 పడకల సామర్థ్యం కలిగిన ఉస్మానియా ఆసుపత్రి, 1200 పడకలు కలిగిన గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 165 మంది నర్సుల కొరత ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈ ఆసుపత్రుల నుంచి ఇతర జిల్లాలకు బదిలీలో వెళ్లగా, వీరి స్థానాలను భర్తీ చేయలేదు. కొత్త పోస్టుల విషయంలో ప్రభుత్వం ప్రకటన జారీ చేసి భర్తీ చేయకపోవడంతో నర్సుల పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): గాంధీ, ఉస్మానియా జనరల్ ఆసుపత్రులకు నిత్యం ఒక్కో ఆసుపత్రికి సుమారు 3000 మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, ఇన్‌పేషెంట్లు 1200 వరకు వస్తుంటారు. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి వైద్య సేవలందించడంతో నర్సుల పాత్ర ప్రముఖమైంది. రోగికి సహాయకరంగా ఉండటంతో పాటు, మందులు, చికిత్స తదితర సేవలందిస్తుంటారు.
ఇటీవల జరిగిన బదిలీల్లో ఉస్మానియా ఆసుపత్రి నుంచి 110 మంది నర్సులు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం 193 మంది నర్సులు మాత్రమే రెగ్యులర్ వాళ్లు విధులు నిర్వహిస్తుండగా, మిగతా వాళ్లలో 60 మంది డిప్యూటేషన్‌పై వచ్చిన వారు, 41మంది టిమ్స్ నుంచి, 17 మంది పీసీఎస్పీ నుంచి వచ్చి తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆసుపత్రిలో 400 మంది నర్సులు అవసరముండగా, వీరిలో 55 మంది ఇటీవల జరిగిన బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లారు. ప్రస్తుతం 242 మంది రెగ్యులర్ నర్సులు, డిప్యూటేషన్‌పై 30 మంది, ఒప్పంద ప్రాతిపదికన 130 మంది సేవలందిస్తున్నారు.
డిప్యూటేషన్ మీద వచ్చిన నర్సులు తాత్కాలికంగా కొంత భారం తగ్గించినా అదే శాశ్వత పరిష్కారం కాదు కదా. మెరుగైన వైద్యసేవలందాలంటే రెగ్యులర్ నర్సుల భర్తీ అత్యంత అవసరం. కానీ ఉన్నసిబ్బందినంతా ఇతర జిల్లాలకు బదిలీ చేసి పెద్దాసుపత్రులుగా పేరొందిన వాటిలో సిబ్బంది కొరతను మిగిల్చింది. కనీసం కొత్త పోస్టులు భర్తీ చేయకుండా కాంగ్రెస్ సర్కారు చోద్యం చేస్తుండటం గమనార్హ ం.
కొవిడ్‌ను ఎలా ఎదుర్కొంటారు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రమాణాల ప్రకారం ఐసీయూలో 1:1 నిష్పత్తి ప్రకారం 1 రోగికి ఒక నర్సు, హైరిస్క్పడకల వద్ద 1:2 నిష్పత్తి ప్రకారం ఇద్దరు రోగులకు ఒక్క నర్సు, జనరల్ వార్డులో 1:5 ప్రకారం ఒక్క నర్సు ఐదు మంది రోగులకు సేవలందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో తీవ్రమైన నర్సుల కొరత కనిపించడం గమనార్హం. ఒకవేళ రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరిగి గాంధీలో చేరితే మాత్రం రోగులకు అత్యవసర వైద్యసేవలందించేందుకు సరిపడా నర్సులు లేకపోవడం వల్ల వైద్య సేవల్లో తీవ్రమైన జాప్యం జరిగే అవకాశముంటుంది. మెరుగైన వైద్య సేవలు కూడా అందటంలేదు.
భర్తీ చేయండి..
జిల్లాలో నర్సుల పోస్టులు ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో భారమంతా ఉన్నవాళ్లపైనే పడుతున్నది. బదిలీలు చేశారు కానీ వారి స్థానంలో కొత్తవారినినియమించలేదు. సరిపడా సిబ్బంది లేకపోవడంతోఆ ప్రభావం రోగులపై సైతం పడనున్నది.
– సుజాత రాథోడ్, గెజిటెడ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రెటరీ