సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్‌తో బాధపడే వారికి అండగా నిలిచేందుకు నాడు కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన ఎన్సీడీ కిట్స్ నేడు రోగులకు అందని ద్రాక్షగా మారాయి. మందుల కోసం నిరుపేద రోగులు ఉస్మానియా, గాంధీ వంటి టెర్షరీ దవాఖానలకు వెళితే, అక్కడున్న రద్దీ కారణంగా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. గతంలో అయితే నేరుగా ఈ మందులన్నీ తమ ఇంటి గుమ్మం వద్దకే వచ్చేవని, కనీసం స్థానికంగా ఉన్న బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో సైతం అందజేసేవారని రోగులు చెబుతున్నారు. కానీ గత కొంత కాలంగా ఎన్సీడీ కిట్స్ అందడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కొంత మంది సిబ్బంది మందులు లేవని సమాధానం చెబుతున్నుట్లు తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సైతం ఈ ఎన్సీడీ మందుల కొరత ఉన్నట్లు రోగులు చెబుతున్నారు. గతంలో అయితే ఈ మందులను ఆశాలు, ఏఎన్ఎంల ద్వారా రోగుల ఇళ్లకు వెళ్లి అందచేసేవారని, ముఖ్యంగా వృద్ధులు, క్యాన్సర్, కిడ్నీ, కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగుల్లో బీపీ, షుగర్ వంటి సమస్యలున్న వారికి సైతం ఈ మందులను వారి ఇళ్ల వద్దనే అందించేవారని రోగులు చెబుతున్నారు. అంతే కాకుండా బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా, ఏరియా, ఉస్మానియా, గాంధీ వంటి టెర్షరీ దవాఖానల్లో సైతం ఎన్సీడీ మందులు అందుబాటులో ఉండేవి. అయితే కొంత కాలంగా ఇళ్ల వద్ద ఎన్సీడీ కిట్లను అందచేయకపోవడమే కాకుండా నగరంలోని ఆరోగ్య కేంద్రాల్లో సైతం సకాంలంలో ఈ మందులను అందించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
అంతే కాకుండా నెల రోజులకు సరిపోను ఇవ్వాల్సిన మందులను కొన్ని కొన్ని సార్లు కేవలం 15రోజులకే ఇవ్వడంతో మందుల కోసం దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తుందని రోగులు మండిపడుతున్నారు. మందుల కొరత కారణంగా క్రమం తప్పకుండా వేసుకోవాల్సిన మందులను మధ్య మధ్యలో ఆపివేయాల్సి వస్తుందని, లేకపోతే ప్రైవేటులో కొనుగోలు చేయాల్సి వస్తుందని నిరుపేద రోగులు వాపోతున్నారు. మందులను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని రోగులు మందులను వేసుకోవడం మధ్యలోనే నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు అదుపు తప్పి రోగులకు తీవ్ర అనారోగ్యాల బారిన పడటమే కాకుండా కొన్ని సందర్భాలలో ప్రాణాల మీదకు వస్తుందని రోగులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇకననైనా ఎన్సీడీ కిట్స్ సక్రమంగా అందేలా చూడాలని రోగులు కోరుతున్నారు.