సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : శిల్పా లే అవుట్ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు వెళ్లే శిల్పా లే అవుట్ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. సర్వీస్ రోడ్డుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. భూసేకరణలో ప్రభుత్వ పాఠశాల భవనం కొంత మేరకు కోల్పోతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎస్ఆర్ పద్ధతిలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డిని కమిషనర్ ఆదేశించారు.
విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా దాటి వెళ్లిన సందర్భంలో ప్రమాదం సంభవించకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి.. సకాలంలో గమ్యానికి చేరే వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ నగరవాసులకు మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సీఈ దేవానంద్, ఎస్ఈ శంకర్ నాయక్, డీసీ ముకుందారెడ్డి, ఈఈ హరీశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే..
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని పలు సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు సమర్పించిన అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంపై ఆయా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా నాలుగు విన్నపాలు రాగా, పరిష్కారం నిమిత్తం ఆయా విభాగాలకు పంపించినట్లు పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 43 విన్నపాలు రాగా, అందులో టౌన్‌ప్లానింగ్ విభాగానికి 19, ఇంజినీరింగ్ 9, ఎఫ్ఏ సెక్షన్ నాలుగు, ఎలక్ట్రికల్ , అర్బన్ బయోడైవర్సిటీ రెండు చొప్పున, ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్, శానిటేషన్, స్పోర్ట్స్, ఎస్టేట్, హెల్త్, లేక్స్ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఆరు జోన్లలో మొత్తం 99 అర్జీలను స్వీకరించగా, కూకట్‌పల్లిలో 53, సికింద్రాబాద్‌లో 20, శేరిలింగంపల్లిలో 12, చార్మినార్‌లో 8, ఎల్బీనగర్లో 6 విన్నపాలు స్వీకరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, సుభద్ర దేవి, నళిని పద్మావతి, పంకజ తదితరులు పాల్గొన్నారు.