సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): గ్రూప్ స్టడీ పేరుతో యువతికి దగ్గరై, తనతో కలిసి తిరుగాలంటూ వేధిస్తున్న యువకుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నగరానికి జీవనోపాధి కోసం వచ్చిన బాధితురాలు హాస్టల్లో ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ, భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించేందుకు చదువుతున్నది. గ్రూప్ స్టడీస్‌లో నగరానికి చెందిన షాహిద్ నవాబ్ అనే యువకుడు పరిచయమై స్నేహితుడయ్యాడు. తనతో తిరుగాలంటూ ఆమె వెంటపడుతున్నాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆమెకు అసభ్యకరమైన మేసేజ్‌లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. తనను వేధించవద్దని, నాకు ఇష్టం లేదంటూ బాధితురాలు చెప్పింది. అయినా ఆమెను వేధిస్తూ బ్లాక్మెయిల్ చేస్తుండటంతో బాధితురాలు షీ టీమ్స్‌కు వాట్సాప్ మేసేజ్ పంపింది. వెంటనే స్పందించిన షీ టీమ్స్.. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
రెడ్ హ్యాండెడ్‌గా..
ఎస్ఆర్నగర్ నడుచుకుంటూ వెళ్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సురేశ్‌ను పెట్రోలింగ్ నిర్వహిస్తున్న షీ టీమ్స్ బృందం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచింది. న్యాయస్థానం అతడికి మూడు రోజుల జైలు శిక్ష విధించింది.
మాజీ భర్త వేధింపులు.. 5 రోజుల జైలు
23 ఏండ్ల బాధితురాలికి భర్తతో విడాకులయ్యాయి. అయినా కూడా ఆమె మాజీ భర్త ఫోన్లు చేసి వేధిస్తున్నాడు. పలుమార్లు ఆమె ఫోన్ నంబర్‌ను కూడా మార్చేసింది. అయినా ఆమెకు వేధింపులు తప్పలేదు. ఆమె గూర్చి స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేయడం, పనిచేసే చోటుకు వెళ్లి ఇబ్బంది పెడుతున్నాడు. మరో పెండ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఉండనివ్వనంటూ ఆమెను భయపెడుతూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. ఆమె మాజీ భర్త మనిదీప్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
కాల్‌లాగ్ షేర్ చేయాలి..
ఫార్మసీలో పనిచేస్తున్న బాధితురాలు, తోటి ఉద్యోగి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనకు చెప్పకుండా బయటకు వెళ్లవద్దని, తన అనుమతి లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావద్దని, ఫోన్ చేస్తే సింగిల్ రింగ్‌లో లిఫ్ట్ చేయాలని, ఎప్పటికప్పుడు కాల్ లాగ్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయాలంటూ షరతులు విధిస్తూ రోజు వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడి వేధింపులపై బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయిచింది. దీంతో నిందితుడు ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.