క్షణికావేశాలలో తీసుకునే నిర్ణయాలు కొందరి మగువల జీవితాల్లో తీరని వ్యధను మిగిలిస్తాయి. వ్యక్తిగతం బయటపెడుతామంటూ.. బ్లాక్‌మెయిలింగ్ చేసే దుర్మార్గుల తీరుతో లోలోన కులిమిపోతారు. ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కాక.. మనోవేదనకు గురవుతుంటారు. అలాంటి వారు చివరి ప్రయత్నంగా షీ టీమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సమస్యల నుంచి బంధ విముక్తులవుతున్నారు. వేధించే వారి భరతం పడుతున్న షీటీమ్స్.. కలత చెందిన ‘ఆమె’ మనసుకు సాంత్వన చేకూరుస్తున్నది. బాధితుల నుంచి కృతజ్ఞతలు అందుకుంటున్నది.
ఓ మహిళా న్యాయవాది స్నానం చేస్తుండగా, ఎవరో ఫొటోలు తీశారు. వాటిని అడ్డం పెట్టి బ్లాక్‌మెయిలింగ్ చేశారు. ఆమె డబ్బులిస్తూ వెళ్లింది. రూ. 10 లక్షల వరకు చెల్లించింది. ఇంకా డబ్బులు అడుగుతూ ఉండటంతో బ్లాక్‌మెయిలర్ ఎవరు.?. ఎందుకు నన్నే టార్గెట్ చేశాడు. తన వ్యక్తిగత ఫొటోలు ఇంకెవరికన్నా ఇచ్చాడా? ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి.. ఇంట్లో చెప్పలేను.. ఇలా అనేక ప్రశ్నలు ఆమె మదిలో మెదిలాయి.. లోలోన కుమిలిపోయింది.
చివరి ప్రయత్నం గా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఆమెకు కొండంత ధైర్యమిచ్చిన షీటీమ్స్.. బ్యాంకులో డిపాజిట్ అవుతున్న డబ్బులు.. బ్లాక్మెయిల్ సెల్‌ఫోన్ కాల్స్‌ను గుర్తించింది. ‘మీ వద్ద పనిచేసే ఓ వృద్ధుడే అలా చేస్తున్నాడం’టూ బాధితురాలికి చెప్పారు. ముందుగా ఆమె నమ్మలేదు. ఆధారాలు ముందు పెట్టడంతో తన ఇంట్లో పనిచేసేందుకు 60 ఏండ్ల వృద్ధుడిని నియమించామని, ఇంత పనిచేస్తాడనుకోలేదం’టూ ఆవేదన చెందింది. బ్లాక్‌మెయిలర్ ఆటకట్టించింది.
అమీర్‌పేట్‌కు చెందిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగినికి కారు డ్రైవర్ పరిచయమయ్యాడు. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అతడి కారులోనే తిరగడంతో స్నేహం ఏర్పడింది. గ్రామం నుంచి వచ్చిన ఆమెకు నగరంలో ఎవరూ తెలియకపోవడంతో డ్రైవరే అన్ని విషయాల్లో తోడున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి.. శారీరక సంబంధం ఏర్పడింది. చేసిన తప్పును తెలుసుకున్న బాధితురాలు.. అతడిని దూరం పెట్టింది. అప్పటి నుంచి ఆ డ్రైవర్ ఆ యువతిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ‘నీ ఫొటోలు నావద్ద ఉన్నాయి.. వాటిని సోషల్‌మీడియాలో పెడుతానం’టూ వేధించసాగాడు. ‘ఆ ఫొటోలు ఎవరికీ చూపెపెట్టకుండా ఉండాలంటే నాకు నెలకు రూ. 8 వేలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి’ అనే షరతు విధించాడు.
ఐదేండ్ల కిందట పెట్టిన ఈ షరతుకు భయపడ్డ బాధితురాలు తాను ఉద్యోగం చేస్తూ..నెలవారీగా రూ. 8 వేల నుంచి రూ. 15 వేల వరకు డ్రైవర్ ఖాతాలో వేస్తూ వెళ్లింది. ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఏండ్ల తరబడి లోలోన కుమిలిపోయింది. చివరి ప్రయత్నంగా షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. తన పేరు బయటకు రావొద్దని, తనను ఇబ్బందుల నుంచి బయటపడేయాలని ప్రాధేయపడింది. షీటీమ్స్ ఎస్సై బాధ్యత తీసుకొని.. బాధితురాలిని సముదాయించారు. ‘గతం గురించి ఆలోచించకు.. వర్తమానం, భవిష్యత్ గురించి ఆలోచించమ్మ’ అంటూ అభయమిచ్చారు.
‘నీ పేరు బయటకు రాకుండా నిందితుడిని పట్టుకుంటామం’టూ భరోసా ఇచ్చారు. ఏపీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడం కోసం బాధితురాలి ద్వారా హైదరాబాద్‌కు పిలిపించారు. డెకాయి ఆపరేషన్ ద్వారా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడా డ్రైవర్ మళ్లీ జోలికి రావడం లేదు.. బాధితురాలు షీ టీమ్స్‌ను ప్రశంసిస్తూ అధికారులు తనను బిడ్డలా ఆదిరించారని.. కృతజ్ఞతలు చెప్పుకున్నది.
పెండ్లి కాకముందు స్నేహంగా ఉంటూ.. శారీరక సంబంధాన్ని కొనసాగించారు. యువతికి వేరే వాళ్లతో పెండ్లి అయింది. అయితే వివాహానికి ముందు సంబంధం కొనసాగించిన వ్యక్తి, తాను పిలిచినప్పుడుల్లా రావాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం ప్రారంభించాడు. రాకపోతే ఫొటోలన్నీ సోషల్‌మీడియాతో పాటు మీ అమ్మనాన్నలకు పంపిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆమె విషయాన్ని అటు భర్తకు, ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక అతడు చెప్పినట్లు కొన్నాళ్లు వింటూ వెళ్లింది.
పెండ్లికి ముందు చేసిన తప్పు తన సంసారంలో చిచ్చు పెడుతుందని తనలో తాను కుమిలిపోయింది. షీ టీమ్స్‌ను తనను గట్టెక్కిస్తుందనే భరోసాతో వాట్సాప్‌లో తన సమస్యను వివరించింది. షీ టీమ్స్ సమస్యను అర్ధం చేసుకొని, బ్లాక్‌మెయిలర్ తాట తీసింది. తన సంసారాన్ని నెలబెట్టారంటూ.. ప్రశంసిస్తూ.. షీ టీమ్స్‌కు బాధితురాలు మెసేజ్ పెట్టింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీతో హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం వచ్చిన ఓ పంజాబీ యువతికి గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశారు. ఆమె వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఆ యువతి షీ టీమ్స్‌ను ఆశ్రయించగా, అతడు తెలిసిన వ్యక్తే అని తేలింది. బాధితురాలికి తోడుంటున్నట్లు నటిస్తూ, ఆమె ఫొటోలు తీస్తూ వాటిని మార్ఫింగ్ చేసి నకిలీ ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.