Hyderabad | ఉస్మానియా యూనివర్సిటీ/ జవహర్‌నగర్, మార్చి 7: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని సొంత అక్కనే ప్రియుడి సహాయంతో ఓ చెల్లి మట్టు పెట్టింది. ఆ ప్రియుడే నగల కోసం ప్రియురాలి తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలు లాలాగూడ, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన సుశీలకు నలుగురు సంతానం. జ్ఞానేశ్వరి(45), లక్ష్మి (40), ఉమామహేశ్వరి(35) ముగ్గురు కూతుళ్లు , శివ(37) కుమారుడు. వీరిలో ఎవ్వరికీ వివాహం జరగలేదు. పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసికస్థితి సరిగ్గా ఉండేది కాదు. చిన్న కూతురు ఉమామహేశ్వరి లాల్బజార్లో కాల్ సెంటర్ ఉద్యోగిణి.
కుమారుడు శివ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా డు. కొన్నేళ్ల క్రితం సుశీల భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో అతని రైల్వే ఉద్యోగం రెండో కూతురు లక్ష్మికి వచ్చింది. 2018 వరకు వీరందరూ లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోనే ఉండేవారు. ఆ తరువాత జవహర్‌నగర్ పోలీసే స్టేషన్ పరిధిలోని కౌకూర్ లో ఇల్లు కట్టుకొని సుశీల, కూతురు ఉమమహేశ్వరి, కోడలు శ్రవంతితో కలిసి ఉంటున్నది. లక్ష్మి లాలాగూడ వర్క్‌షాప్‌లో ఉద్యోగం చేస్తుండడంతో అక్క జ్ఞానేశ్వరితో రైల్వే క్వార్టర్స్‌లో ఉంటుంది. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన అరవింద్(45)తో వీరి కుటుంబానికి పరిచయం ఉంది.
ఈ క్రమంలో లక్ష్మికి అరవింద్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా.. ఈ నెల 6న సాయం త్రం 7 గంటల సమయంలో అరవింద్ జవహార్‌నగర్‌లోని లక్ష్మి తల్లి ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తల్లి సుశీల అక్కడికక్కడే మృతి చెందడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కూతురు ఉమా మహేశ్వరి ఇంటికొచ్చే సరికి తల్లి చనిపోయి ఉండడంతో సీసీ కెమెరాలు పరిశీలించి.. తల్లి సుశీలను అరవింద్‌కుమార్ అనే వ్యక్తి చీరతో మెడకు బిగించి ఊపిరాడకుండా నోట్లో గుడ్డలు కుక్కి చంపి, మూడున్నర తులాల బంగారు నగలు ఎత్తుకెళ్ళాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు శుక్రవారం విచారణ నిమిత్తం లక్ష్మి ఇంటికి రాగా అవాక్కయ్యే మరొక నిజం పోలీసులకు తెలిసింది. తమ సంబంధానికి అడ్డు ఉన్నదని అక్క జ్ఞానేశ్వరిని రెండ్రోజుల క్రితం చంపి సంపులో మూటకట్టి పడేసినట్లు లక్ష్మి వెల్లడించింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంపులో ఉన్న మృతదేహాన్ని వెలికితీయగా సదరు మృతదేహం పూర్తిగా డీకంపోజ్డ్ స్టేజ్‌లో ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అయితే, లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను వెంటబెట్టుకొని అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.