బంజారాహిల్స్,ఏప్రిల్ 19: సంపన్నుల ఇంటి ఆడపిల్లలే టార్గెట్..ఖరీదైన కారులో షికార్లు.. పబ్బులు క్లబ్బుల్లో కాలక్షేపాలు.. మరో అడుగు ముందుకేసి విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలను గుర్తించి ఇన్స్టాగ్రామ్ ద్వారా తన స్నేహం పెంచుకుంటాడు. మైనర్లు, మేజర్లు అనే ఆలోచనే లేకుండా డబ్బున్న బాలికలతో స్నేహం పెంచుకుని వారితో సన్నిహితంగా ఫొటోలు దిగుతాడు. ఇలా సంపన్న కుటుంబాలకు చెందిన యువతులకు గాలం వేస్తూ సోషల్‌మీడియా ద్వారా వారిని ప్రేమపేరుతో లోబర్చుకుని మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు, షీటీమ్స్ సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
గుంటూరుకు చెందిన కోడూరి చంద్రశేఖర్ అజాద్ అలియాస్ అర్జున్(28) కూకట్‌పల్లిలోని ఓ హాస్టల్లో నివాసం ఉండేవాడు. జూబ్లీహిల్స్‌లోని పబ్స్‌లో తిరుగుతూ అక్కడకు వచ్చే యువతులతో పరిచయం పెంచుకునేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్ అనే పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి.. ఆకట్టుకునే ఫొటోలు, లగ్జరీ లైఫ్‌ను సూచించే వీడియోలు పోస్ట్ చేస్తూ యువతులకు వలవేస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న బాలిక (15)ను ఏడాదిన్నర కిందట ప్రేమపేరుతో ముగ్గులోకి దించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, జైలునుంచి వచ్చిన కొన్నాళ్ల తర్వాత తిరిగి బాలిక ఇంటివద్దకు రావడం, అక్కడ పనిమనిషిగా చేస్తున్న మహిళ(35) ఫోన్ ద్వారా బాలికను మరోసారి మాయమాటలతో లోబర్చుకున్నాడు.
తాను స్టార్టప్ కంపెనీ పెడుతున్నానని, పెట్టుబడి కోసం కొంత డబ్బు తక్కువ పడిందంటూ బాలికను నమ్మబలికాడు. దీంతో బాలిక తన తండ్రి వద్ద నుంచి పలుమార్లు డబ్బులు తస్కరించి సుమా రు రూ.13 లక్షల దాకా చంద్రశేఖర్‌కు ఇచ్చింది. చంద్రశేఖర్‌తో బాలిక తిరిగి సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానంటూ బాలిక ఇంట్లో పనిచేస్తున్న మహిళ సైతం పలుమార్లు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి.. సుమారు రూ.9 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో తనను ప్రేమపేరుతో వెంట తిప్పుకొంటూ డబ్బులు గుంజుతున్న చంద్రశేఖర్ మరికొంతమంది యువతులతో ఎఫైర్లు కొనసాగిస్తున్నట్లు ఇటీవల బాలిక గుర్తించింది.
ఇదేంటని ప్రశ్నిస్తే వారితో బ్రేకప్ అయిందని నమ్మబలికి ఇటీవల నేరుగా బాలిక ఇంటికి వచ్చి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండ్రోజుల కిందట చంద్రశేఖర్ మరో యువతితో రొమాన్స్ చేస్తూ పట్టుబడడంతో అతడి మోసాలను బాలిక గుర్తించి.. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు చంద్రశేఖర్ అజాద్‌తో పాటు బ్లాక్మెయిల్ చేసి రూ.9 లక్షలు వసూలు చేసిన పని మనిషిపై బీఎన్ఎస్ 64(2), 308(2) సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా పలువురు యువతులను ఇదే విధంగా మోసం చేసినట్లు తేలింది.
పెళ్లి పేరుతో మరో యువతిని..
తనను ప్రేమ పేరుతో చంద్రశేఖర్ అజాద్ మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడి చేశాడంటూ గుంటూరుకు చెందిన యువతి(21) జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు ప్రాంతానికి చెందిన యువతి కాలేజీలో చేరేందుకు గత ఏడాది జూన్‌లో నగరానికి వచ్చింది. కామన్ ఫ్రెండ్ ద్వారా యువతికి పరిచయం అయిన చంద్రశేఖర్ అజాద్ ఖరీదైన కారులో తిరుగుతుండడంతో పాటు హాస్టల్లో చేర్పిస్తానంటూ నమ్మబలికాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నార్సింగిలోని హోటల్ గదిలో దిగాడు. పనిమీద స్నేహితులను బయటకు పంపించిన చంద్రశేఖర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
తర్వాత పలు రిసార్ట్స్‌లు, హోటళ్లకు తీసుకువెళ్లి పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. వ్యాపారంలో పెట్టుబడి కోసం అంటూ బంగారు గొలుసును తీసుకున్నాడు. కాగా శనివారం జూబ్లీహిల్స్‌లో ఓ బాలికతో చంద్రశేఖర్ పట్టుబడడంతో తనతో పాటు పలువురు యువతులతో సంబంధాలు పెట్టుకున్నాడని గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై బీఎన్ఎస్ 69,318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు.