బంజారాహిల్స్, ఫిబ్రవరి 11: ప్రేమిస్తున్నానని నమ్మించి.. లైంగికదాడికి పాల్పడటంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటానని ఐదేండ్ల పాటు సహజీవనం చేసి ముఖం చాటేసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన కాళీ స్నేహిత్ ప్రణయ్‌రాజ్ (29) హయత్‌నగర్ పరిధిలో రెండు హాస్టళ్లు నిర్వహించాడు.
2015లో నాగోల్‌లో అద్దెకు ఉన్న సమయంలో ప్రణయ్‌రాజ్‌కు అదే ప్రాంతంలో ఉంటున్న యువతి(26)తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించిన ప్రణయ్‌రాజ్.. ఆమెను గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అప్పటినుంచి వారిద్దరు సహజీవనం చేశారు. పెండ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడి వస్తానంటూ చెప్పి గత ఏడాది ఆగస్టులో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా..
అతడు గత ఏడాది ఆగస్టులో కర్నూల్‌కు చెందిన యువతితో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తేలింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కుటుంబసభ్యులు నచ్చజెప్పారు. అయితే, హాస్టల్ పేరుతో ప్రణయ్‌రాజ్ పలుమార్లు బాధితురాలి నుంచి దాదాపు రూ.10 లక్షల వరకు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వాలని కోరగా.. కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని అతడు హెచ్చరించాడు.
బాధితురాలు ఇటీవల ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పరిధి కాదంటూ పోలీసులు చెప్పడంతో షీటీమ్స్‌ను ఆశ్రయించింది. వారి సూచనల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 376, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు ప్రణయ్రాజ్ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.