sewerage line | బంజారాహిల్స్,జనవరి 3: ‘హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీ చేస్తాం..మా పోటీ ఇతర రాష్ర్టాలతో కాదు ఇతర దేశాలతో ..మూసీని సుందరీకరించి పెట్టుబడులను తీసుకువస్తాం.. ఫ్యూచర్ సిటీ నిర్మించి చైనాతో పోటీ పడుతాం’ అంటూ సమావేశాల్లో ప్రసంగిస్తుండే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో సీవరేజ్ లైన్ పొంగిపొర్లుతూ నగరవాసులకు నరకం చూపిస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని పెద్దమ్మగుడి మెట్రోస్టేషన్ మీదుగా చెక్‌పోస్ట్ వెళ్లే రోడ్డుపై సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌తో సహా వేలాదివాహనాలు ప్రయాణిస్తుంటాయి.
కొన్నినెలలుగా ప్రధాన రోడ్డుపై సీవరేజ్ లైన్ నుంచి భారీగా మురుగు పొంగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దుర్వాసనలతో డ్రైనేజీ పొంగుతుండడంతో రోడ్డుమీద వెళ్తున్న వాహనాదారులు ముక్కుమూసుకుని ప్రయాణిస్తున్నారు. సమీపంలో ఉన్న పబ్స్, రెస్టారెంట్స్‌కు సంబంధించిన వ్యర్థాలను నేరుగా డ్రైనేజీల్లోకి వదులుతుండడంతో సీవరేజ్ లైన్ మొత్తం నిండిపోవడంతో ఎప్పుడు చూసినా ఇక్కడ మురుగునీరు ప్రవహిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిల్ట్ చాంబర్లు లేకుండానే డ్రైనేజీల్లోకి వ్యర్థాలు వదిలిపెట్టడంతో మ్యాన్‌హోళ్లు పొంగుతున్నాయని గతంలోనే అధికారులు గుర్తించినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాంతం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నివాసం కిలోమీటర్ దూరంలోనే ఉంటుందని, ప్రతిరోజు పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ఇదే మురుగులో ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తూతూమంత్రంగా జలమండలి సిబ్బంది వచ్చి క్లీనింగ్ చేస్తుంటారని,రెండ్రోజుల్లోనే మళ్లీ మురుగు పొంగుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న ఆభరణాలషాపులతో పాటు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులు. ఫిర్యాదుదారులు నరకం చవిచూస్తున్నారని,మురుగు నీటి కారణంగా దోమల ఉధృతి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతులు సాధ్యం కాదు..
జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లోని మెట్రోస్టేషన్ కింద మురుగు సమస్యలకు కారణాలను అన్వేషించేందుకు నాలుగురోజుల క్రితం జలమండలి, ఎల్అండ్టీ మెట్రో రైల్ అధికారులతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాం. సీవరేజ్ లైన్ చాలా ప్రాంతాల్లో ధ్వంసం కావడంతో పాటు పూడిక నిండిపోయినట్లు తేలింది. దీంతో సీవరేజ్ లైన్‌ను మరమ్మతులు చేయడం సాధ్యంకాదు. మెట్రోరైల్‌కు చెందిన స్టేషన్ భద్రతతో పాటు విద్యుత్ షార్ ్టసర్క్యూట్స్ ప్రమాదం ఉంది. దీంతో మెట్రో అధికారులు సీవరేజ్ లైన్ మరమ్మతులకు అనుమతులు ఇవ్వలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా 300 ఎంఎం డయాలైన్ వేయాల్సి ఉంది. ప్రతిపాదనలు సిద్ధం చేశాం.
– ప్రభాకర్,జలమండలి జీఎం