మేడ్చల్, నవంబర్30(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన 15 ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 5,650 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. రైతులకు రూ.13 కోట్ల 78 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.65 లక్షలు మాత్రమే చెల్లించారు.
మిగతా వారికి త్వరలోనే వారి ఖాతాలలో నగదు జమ చేస్తామని అధికారులు చెపుతున్నారు. అయితే ధాన్యాన్ని కొనుగోలు చేసిన నాలుగు నుంచి ఐదు రోజులలో రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తామని చెప్పినా ఇప్పటివరకు నగదు జమకాలేదని రైతులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 25 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యంగా జిల్లా పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేసింది. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,369 ధర కాగా కామన్ రకానికి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,369గా నిర్ణయించారు. అయితే సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్‌ను ప్రభుత్వం అందించాల్సి ఉంది. గతేడాది డబ్బులే ఇంతవరకు ఇవ్వని పరిస్థితి.
25వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా..
జిల్లావ్యాప్తంగా 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనా. అయితే సన్న రకం ధాన్యానికి గత సీజన్లో విక్రయించిన వాటికే రూ500 బోనస్ అందించలేదని అయితే ఈ సీజన్లో విక్రయించిన సన్న రకం ధాన్యానికి అసలు బోనస్ అందిస్తారా లేదా అని రైతులు.. అధికారులను ప్రశ్నిస్తున్నారు. గత సీజన్లో విక్రయించిన సన్న రకం ధాన్యానికి రూ. కోటి 63 లక్షలను రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉంది. ఈ సీజన్లో విక్రయించిన సన్న రకం ధాన్యానికి ధాన్యం నగదుతో పాటు బోనస్ డబ్బులను జమచేయాలని రైతులు కోరుతున్నారు. 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంచనా వేయగా ఇప్పటివరకు మాత్రమే 5,650 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి.