సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో అక్రమణల తొలగింపు ప్రక్రియ ‘బలహీనుడి’పై బ్రహ్మాస్తం..బలవంతుడికి వెన్నుదన్నుగా అన్న చందంగా సాగుతున్నది. ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట నింపుకునే పేదలపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు.. కీలకమైన రద్దీ మార్గాల్లో రహదారులను ఆక్రమించి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన బడా వ్యాపార సముదాయాలు, భారీ నిర్మాణాల జోలికి వెళ్లడం లేదు. నిబంధనల పేరుతో సామాన్యుడి బతుకుదెరువును రోడ్డున పడేస్తున్న యంత్రాంగం, రాజకీయ అండదండలున్న పెద్దల అక్రమ కట్టడాల వద్ద వచ్చే సరికి కళ్లున్నా చూడలేని స్థితిలో పడిపోతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలు పేదలకే వర్తిస్తాయి… నిబంధనలు సైతం వారికే అమలవుతాయి… ఇది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల తీరు.
ఇటీవల క్యూర్(జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో అధికారుల తీరు దీనికి అద్ధం పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ పలుచోట్ల అధికారులు నిర్మాణాలు కూల్చివేశారు. పేదలు ఏర్పాటు చేసుకున్న పుట్‌పాత్ చిరు వ్యాపారాలు తొలగించి, వారి జీవనోపాధి లేకుండా చేశారు. కానీ బడాబాబుల అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ప్రజావాణిలో పలు ఫిర్యాదులు అందిన, అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తులు, సెల్లార్లు వీరికి కనిపించవు. నోటీసులు ఇచ్చామనే సమాధానం మాత్రం అధికారుల నుంచి వస్తుంది. అసలు అనుమతులు ఒకలా తీసుకొని, పూర్తి విరుద్ధంగా నిర్మాణం చేపట్టేవారికి, సెల్లార్ తవ్వకాలు చేసేవారికి, అసలు అనుమతులే లేకుండా నిర్మాణాలు చేసేవారికి నోటీసులు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా మారుతున్నది. జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా చేసిన ప్రభుత్వం, పర్యవేక్షణలో విఫలమవుతుందనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఐఏఎస్‌లు ఉన్నా అక్రమ నిర్మాణాల జోరు
క్యూర్ పరిధిలో దాదాపుగా అన్ని జోనల్ కార్యాలయాలకు ఐఏఎస్‌లే బాస్‌లుగా ఉన్నారు. అయి నా అక్రమ నిర్మాణాలు కొనసాగుతునే ఉన్నాయి. చర్యలు చేపట్టాల్సిన అధికారులపై ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో యథేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ నిర్మాణాలను చేపట్టకుండా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే నిలిపివేయాల్సిన అధికారుల తీరు అనుమానాలకు దారి తీస్తుంది. నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత కూల్చివేయడం, సీజ్ చేయడం సరికాదని, ఆదిలోనే అక్రమ నిర్మాణాలు నిలిపివేయడం ద్వారా కొనుగోలుదారులకు, ప్రభుత్వానికి ఆదాయం కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న, అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కమిషనర్‌కు సవాల్‌గా మారిన అక్రమ నిర్మాణాలు
అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, భవనాలు సీజ్ చేస్తామని ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఆయా ప్రాంతాలలో పర్యటించి, చర్యలు చేపట్టారు. కానీ అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మల్కాజిగిరి జోనల్ మౌలాలి సర్కిల్ పరిధిలో పలు అక్రమ నిర్మాణాలు, బహుళ అంతస్తులు నిర్మిస్తున్న, ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. మౌలాలి, ఓల్డ్‌సఫిల్‌గూడ, వినాయక్‌నగర్, ఆనంద్‌బాగ్-నేరేడ్మెట్ రహదారుల్లో కొనసాగుతున్న నిర్మాణాలపై కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన చేయాలని కోరుతున్నారు. ఉప్పల్, నాచారం, అల్వాల్ సర్కిల్స్ పరిధిలోని నిర్మాణాలపై విచారణ చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణాలు పూర్తిచేసే వరకు జాప్యం చేయడం, ఆయా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిసిన వాటిపై చర్యలు తీసుకోకుండా, ఎలా పూర్తి చేయవచ్చో అనే సలహాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కులు, బావి స్థలాలు ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల జోనల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన ఏ మాత్రం చలనం లేకపోవడం గమనార్హం.
క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల తీరుపై విమర్శలు
అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది, వాటిపై చర్యలు చేపట్టాల్సిన అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. చర్యలు చేపట్టడంలో అధికారుల తాత్సర్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వెంకటాద్రినగర్, విమలాదేవినగర్, జ్యోతినగర్, మల్లికార్జున్‌నగర్, ఆర్కేనగర్, ఉప్పల్‌లోని భగాయత్, ప్రధాన రహదారి, చిలుకానగర్, రామంతాపూర్, తదితర ప్రాంతాలలో చేపడుతున్న నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదులు వస్తేనే చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులు, అసలు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏం చేస్తున్నారని, టౌన్‌ప్లానింగ్ విభాగం పని ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చైన్మెన్లు, న్యాక్ ఇంజినీర్లు, టీపీఎస్‌ల విధులు ఏమిటో అర్ధంకావడంలేదు. మౌలాలి సర్కిల్ కార్యాలయంలో ఏకంగా మున్సిపల్ విభాగానికి సంబంధంలేని వ్యక్తి దర్జాగా కూర్చిలో కూర్చోని పనులు చేస్తుండటం విమర్శలకు దారితీస్తుంది.
ఇరుకైన రోడ్డులో భారీ నిర్మాణం
అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో నిబంధనలను తుంగలో తొక్కి ఓ భవన యాజమాని యథేచ్ఛగా నిర్మాణం చేపడుతున్నారు. రోడ్ నం 13లోని శ్రీరాం నగర్ ప్లాట్ నెం 9-2-676/బీ/43లో అనుమతి లేకుండా దాదాపు ఐదు అంతస్తులకు మించి అడ్డగోలు నిర్మాణం జరుగుతున్నది. కేవలం 25 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డులో ఇంత భారీ స్థాయి నిర్మాణం చేపట్టడుతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం ఫైర్ ఇంజిన్ కూడా వెళ్లలేని చోట ఇలాంటి భారీ భవనంలో ఒకవేళ ప్రమాదం సంభవిస్తే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెట్బ్యాక్లు గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా స్లాబులు వేస్తుండడం, ఈ నిర్మాణంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడం అదికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.