చార్మినార్ : మారుతున్న సాంకేతిక నైపుణ్యభివృద్ధిని యువతకు అందించేందుకు సెట్విన్ ( Setwin ) కృషి చేస్తుందని ఆ సంస్థ ఎండీ వేణుగోపాల్‌రావు ( MD Venugopal Rao) తెలిపారు. త్వరలో 30వ కేంద్రాన్ని నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జంట నగరాల యువతకు ఉపాధి అవకాశాల రంగాల్లో శిక్షణ కల్పించి స్వీయ ఎదుగుదల కోసం స్థాపించిన సెట్విన్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
సెట్విన్ ఆధ్వర్యంలో స్వల్ప, దీర్ఘ కాలిక కోర్సులు ఆన్లైన్, ఆఫ్లైన్ల ద్వారా అందిస్తున్నామని వివరించారు. ఇందులో ప్రత్యేకంగా మహిళలకు మెహందీ, డిప్లొమా ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్స్, డిప్లొమా బ్యూటిషియన్ తదితర మరో 10 కోర్సు లను అందిస్తుందన్నారు. ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, ఎడ్యుకేషనల్ సబ్జెక్టులతోపాటు టెక్నాలజీ రంగాల్లోను విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని వివరించారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో 19 సెట్విన్ కేంద్రాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో పది కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సెట్విన్ 30వ కేంద్రాన్ని గోషామహల్ నియోజకవర్గంలోని ధూల్ పేట్ ప్రాంతం హనుమాన్ దేవాలయం ఆవరణలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని ఎండీ వివరించారు.
ధూల్ పేట్ లో ఏర్పాటు చేయబోయే సెట్విన్ కేంద్రానికి రోటరి క్లబ్ సౌజన్యం అందిస్తుందని, దానికోసం రూ. 5లక్షల ఆర్థిక సహాయం చేయడానికి సంసిద్దత వ్యక్తం చేసిందన్నారు. ప్రస్తుతం ప్రారంభమవుతున్న ఎడ్యుకేషన్ అడ్మిషన్ సమయంలో ఏప్రిల్ నెల స్వల్పకాలం లోనే 2,912 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు తెలిపారు.