సిటీబ్యూరో: యాప్ అగ్రిగేటర్స్ చేస్తున్న మోసాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని తెలంగాణ గిగ్ ఫ్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్, తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ చైర్మన్ షేక్ సలావుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓలా, ఉబర్, ర్యాపిడోలు కమీషన్ల పేరుతో డ్రైవర్లను దోచుతకుంటున్నాయన్నారు. దూరానికి తగ్గట్టుగా ధరలు నిర్ణయించకుండా కంపెనీలు డ్రైవర్ల బతుకులతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే నో ఏసీ క్యాంపెయిన్ చేశామని, అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రైడ్స్‌ను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.
యాప్ అగ్రిటేటర్స్ తెలంగాణలో కూడా కర్ణాటకలో ఉన్న విధానాలను అమలు చేయాలన్నారు. వాహన ధరలను ఆధారంగా చేసుకుని కర్ణాటకలో రైడ్స్ ధరలు నిర్ణయించారని, అదే విధంగా ఇక్కడ అమలు చేయాలని కోరారు. పది లక్షల లోపు విలువజేసే వాహనాలకు 4 కిలోమీటర్ల దూరానికి రూ.100 రైడ్ ధర ఉండాలని, ప్రతి అదనపు కిలో మీటర్‌కు రూ.24గా నిర్దేశించాలని సూచించారు. 15 లక్షలపై ధర ఉండే వాహనానికి మొదటి 4 కిలో మీటర్లకు రూ.130 ధర ఉండాలని.. అదనపు కిలోమీటర్‌కు రూ.32 చార్జీ చేసేలా రూపొందించాలని కోరారు. ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించారు.