సిటీబ్యూరో/శామీర్పేట, మార్చి 20 : ఇతర రాష్ర్టాల వాహనాలు తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ట్రిప్పులు కొడుతూ తమ ఉపాధిని దెబ్బతీస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్లు కమీషన్లు ఎక్కువగా తీసుకొని తమకు తక్కువ చార్జీలు చెల్లిస్తున్నదని క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ చెప్పారు. అందులో భాగంగా యాప్లను బహిష్కరించామన్నారు. 57వేల మంది క్యాబ్డ్రైవర్లు నిరసనలో పాల్గొన్నారని వివరించారు. ఎయిర్పోర్ట్ ట్రిప్స్ బహిష్కరించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం యాప్ తీసుకొస్తామని మాటిచ్చి ఇప్పటికీ అమలు చేయలేదని చెప్పారు. ఆర్టీఏ అధికారుల అనుమతి లేకుండా ఐటీ కంపెనీల్లో అక్రమంగా ప్రజా రవాణా చేస్తున్న ఇతర రాష్ట్ర వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు తగిన ధరలు నిర్ణయించే వరకు ఎయిర్పోర్ట్ ట్రిప్పులు బహిష్కరిస్తామని చెప్పారు. ఊబర్..ఓలా క్యాబ్ డ్రైవర్లకు చెల్లిస్తున్న ధరను పెంచి తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఊబర్, ఓలా క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్ యాజమాన్యాల తీరుకు నిరసనగా తూంకుంట మున్సిపల్ దొంగలమైసమ్మ-శామీర్పేట ఓఆర్ఆర్ సర్కిల్ వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఊబర్, ఓలా క్యాబ్ డ్రైవర్స్ వేణు గోపాల్, శ్రవణ్ కుమార్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.