Snakes | సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) : ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పాములు కూడా భాగమేనని, అవి మీ ఇండ్లలోకి వేస్తే చంపకుండా సమాచారమిస్తే చాలు పట్టుకుంటామని స్నేక్స్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ప్రతి రోజు స్నేక్స్ సొసైటీకి సుమారు 60-80 ఫోన్ కాల్స్ వస్తున్నాయి, “మా ఇంట్లో పాము చొరబడింది. భయంగా ఉంది. దయచేసి మీరొచ్చి పామును పట్టుకుంటారా” అంటూ విజప్తులు వస్తున్నాయని సొసైటీ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ఎండా కాలం ఉన్నప్పటికీ వర్షాలు కురుస్తుండటం, వాతావరణం చల్లగా ఉండటం కారణంగా పాములు బహిరంగంగా తిరుగుతున్నాయి. వీటిని చూసిన నగరవాసులు కొందరు స్నేక్ సొసైటీకి ఫోన్ చేయగా.. మరికొందరూ వాటిని పట్టుకునే క్రమంలో వాటిపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. పాములు కనిపిస్తే తమకు ఫోన్ చేయాలని.. వాటిపై ఎలాంటి దాడి చేయొద్దని చెప్పారు. 8374233366 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరుతున్నారు.
ఎలుకలు తినేందుకే సర్పాలు వస్తాయి
పాములు దరిచేరకుండా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి. సాధారణంగా ఎలుకలను తినేందుకు సర్పాలు వస్తుంటాయి. మాకు ఎక్కువగా అత్తాపూర్, మియాపూర్, సాగర్ రింగ్ రోడ్డు, గచ్చిబౌలి, లింగంపల్లి, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్ నుంచి అధికంగా ఫోన్లు వస్తుంటాయి. ఫారెస్ట్ అధికారుల సూచనల మేరకు పనిచేస్తున్నాం.
– చంద్ర శేఖర్, స్నేక్స్ సొసైటీ సభ్యుడు