సిటీ బ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గండిపేట జలాశయం (ఉస్మాన్‌సాగర్)లోకి సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మురుగు నీటిని పారబోసిన ఘటన కలకలం సృష్టిస్తున్నది. హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ప్రధాన వనరైన గండిపేట జలాశయంలో జీహెచ్ఎంసీ, జలమండలి లోగోలు కలిగిన ట్యాంకర్‌తో మురుగును వదులుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవ్వడంతో.. జలాశయం వద్ద జలమండలి సిబ్బంది నిఘా ఉంచారు. ఈ క్రమంలో హిమాయత్‌నగర్ వద్ద బుధవారం ఉదయం 8 గంటలకు ఎఫ్టీఎల్ పాయింట్ నంబర్ 428 వద్ద ఓ సెప్టిక్ ట్యాంకర్ మురుగు నీటిని వదులుతుండగా జలమండలి పెట్రోలింగ్ సిబ్బంది పట్టుకున్నారు.
దీనిపై జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యర్థాలు డంప్‌చేసిన ట్యాంకర్‌ను సీజ్ చేయడంతో పాటు ట్యాంకర్ డ్రైవర్, ఓనర్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్ రమావత్ శివ నాయక్, హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్ ఆదేశాలతో మురుగును జలాశయంలోకి వదిలేందుకు ప్రయత్నించినట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా తమ అనుమతి లేకుండా ఆ ట్యాంకర్‌పై జలమండలి లోగోను వినియోగించినట్లు చెప్పారు. అధికారుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మోసపూరితంగా లోగోను వాడినట్లు తేల్చారు. ఆ ట్యాంకర్ జలమండలిలో నమోదు కాలేదని కూడా వెల్లడించారు. అయితే ఉస్మాన్‌సాగర్‌లో ఎలాంటి వ్యర్థాలు కలవలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఐఎస్ ప్రమాణాలతో మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ తర్వాతనే నీటి సరఫరా జరుగుతుందని అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు.