Hyderabad | నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన కాంగ్రెస్ నాయకుడు అలీ మస్కతి కుమారుడు రేహాన్ మస్కతిని పోలీసులు అరెస్టు చేశారు. బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఫార్చూనర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లోని చాంద్రయాణగుట్ట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తున్న ఇద్దరిని రేహాన్ మస్కతి తన కారు (TS12EA8644)తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి ఒకరు మరణించారు. కాగా, యాక్సిడెంట్ ద్వారా ఘటనాస్థలి నుంచి రేహాన్ మస్కతి పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.