హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిల భద్రతకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరైనా హాస్టల్లోకి చొరబడితే హెచ్చరికలు చేసేలా అలారం బెల్స్‌ను, ఆకతాయిల కదలికలను గుర్తించేందుకు మోషన్ డిటెక్షన్ సెన్సార్లను వర్సిటీ క్యాంపస్‌లోని సెంటినరీ మహిళా హాస్టల్ చుట్టూ అమర్చాలని యోచిస్తున్నారు. ఇందుకు ఒక సంస్థతో అధికారులు చర్చిస్తున్నారు. విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటికే వర్సిటీ హాస్టళ్లు, పరిపాలన భవనంలో రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించారు.
పనిచేస్తుందిలా..
హాస్టల్ ప్రహరీ చుట్టూ ఆర్టికల్ ఫైబర్ కేబుల్‌తో కూడిన మోషన్ డిటెక్షన్ సెన్సార్లను అమర్చుతారు.
ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి హాస్టళ్ల వద్ద తచ్చాడితే కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు హాస్టల్లోని సెక్యూరిటీ రూముల్లో అలారం మోగుతుంది.
v పదే పదే కదలికలున్నా, కాంపౌండ్ వాల్స్ ఎక్కడానికి ప్రయత్నించినా అప్రమత్తం చేస్తుంది.